పొరపాట్లకు తావులేకుండా ఈవీఎంల కమిషనింగ్ : కలెక్టర్

నవతెలంగాణ – ఆర్మూర్ 
ఎన్నికలలో పోలింగ్ నిర్వహణ కోసం చేపడుతున్న ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని ఆర్మూర్, బాల్కొండ శాసనసభా నియోజకవర్గాల   డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను కలెక్టర్ ఆదివారం సందర్శించారు. పట్టణం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, భీంగల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో నిర్వహిస్తున్న కమిషనింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. బ్యాలెట్ యూనిట్లు, వివి.ప్యాట్లలో బ్యాలెట్ పేపరు, అభ్యర్థులకు కేటాయించబడిన ఎన్నికల గుర్తులను సక్రమంగా అమర్చాలని, ఏమాత్రం ఏమరుపాటును ప్రదర్శించరాదని హితవు పలికారు. గందరగోళానికి తావులేకుండా పోలింగ్ కేంద్రాల వారీగా కమిషనింగ్ జరిపించాలని సహాయ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. కాగా, ఆర్మూర్, భీంగల్ పట్టణాలలో పోస్టల్ బ్యాలెట్ కోసం ఎంపీడీఓ కార్యాలయాలు, విశ్రాంత ఉద్యోగుల భవన్ లో ఏర్పాటు చేసిన ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాలను సైతం కలెక్టర్ సందర్శించారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ రిజిస్ట్రేషన్, ఓటర్స్ రిజిస్ట్రేషన్ వివరాలతో కూడిన రిజిస్టర్లను పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు వస్తున్న వారికి హెల్ప్ డెస్క్ ద్వారా సహకారం అందించాలని, ఓటరు డిక్లరేషన్ ఫారంను, ఓటరు జాబితాలో క్రమ సంఖ్య, పార్ట్ నెంబరు సరి చూసుకోవాలని అన్నారు. కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్,  రెవెన్యూ డివిజనల్ అధికారి రాజాగౌడ్,  సంబంధిత అధికారులు పాల్గొన్నారు.