ఈసెట్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌ జరపాలి

ESET should conduct special counseling–  విద్యాశాఖ కార్యదర్శికి ఎస్‌ఎఫ్‌ఐ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఈసెట్‌ అభ్యర్థులకు ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియను జరపాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి, రాష్ట్ర సహాయ కార్యదర్శి దామెర కిరణ్‌, ఓయూ కార్యదర్శి ఎం రవినాయక్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్‌ కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈసెట్‌ అభ్యర్థుల కోసం రెండు విడతలుగా కౌన్సెలింగ్‌ నిర్వహించారని తెలిపారు. చాలా మంది అభ్యర్థులకు సీట్లు వచ్చినా కాలేజీల్లో రిపోర్టు చేయలేకపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం విడుదల చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. దీంతో ప్రయివేటు పాలిటెక్నిక్‌ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు ధ్రువపత్రాలను సకాలంలో ఇవ్వడం లేదని తెలిపారు. ఫీజు చెల్లించి ధ్రువపత్రాలను తీసుకెళ్లాలంటూ విద్యార్థులకు చెప్పడంతో వారు డబ్బులు కట్టలేక ధ్రువపత్రాలను తెచ్చుకోలేదని వివరించారు. అందుకే సీటు వచ్చినా కేటాయించిన కాలేజీల్లో చేరలేదని తెలిపారు. అయితే ఈసెట్‌ అభ్యర్థులకు ఏపీలో మూడుసార్లు కౌన్సెలింగ్‌ జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణలో అనేక ఇబ్బందులు పడుతున్న అభ్యర్థుల కోసం మరోసారి కౌన్సెలింగ్‌ను జరపాలని కోరారు.