– ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలపై నిషేధం
– తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మిక, ఉద్యోగ సంఘాలు
లక్నో : హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో అన్నదాతల ఆందోళనల నేపథ్యంలో నిరసనలపై ఉక్కుపాదం మోపేందుకు ఉత్తరప్రదేశ్‌లోని యోగి అదిత్యనాథ్ ప్రభుత్వం ముందస్తు అణచివేత చర్యలకు దిగింది. పాత ఫించను విధానం పునరుద్ధరణ కోసం కార్మిక , ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఉద్యమించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో యోగి ప్రభుత్వం అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టాన్ని (ఎస్మాను) ప్రయోగించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, కార్పొరేషన్లలోని ఉద్యోగులు, అధికారులు సమ్మెలు, నిరసనలు చేయడంపై ఆరు నెలలు పాటు నిషేధం విధించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి (ఏసీఎస్) దేవేశ్‌్ చతుర్వేది సోమవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ‘ఉత్తరప్రదేశ్ ఎస్మా 1966లో సెక్షన్-3లో సబ్ సెక్షన్ 1 ప్రకారం ఈ నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి ఈ నిషేధం ఆరు నెలల పాటు అమలులో ఉంటుందన్నారు.
ఈ అప్రజాస్వామిక చర్యను తాము వ్యతిరేకిస్తామని కార్మిక, ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ప్రేమ్ నాథ్ రారు మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి బెదిరింపులకు తాము భయపడేది లేదన్నారు. ‘నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, కనీస వేతనం, రైతులకు ఎంఎస్పీ వంటి నిజమైన సమస్యలపై దశలవారీగా ఆందోళనలను ఉధృతం చేయాలని సీఐటీయూ, సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయించుకున్నాయి.
ఈ ఎస్మా నోటిఫికేషన్‌ను యూపీ రాజ్య విద్యుత్ కర్మచారిస్ సంయుక్త్ సంఘర్ష్ సమితి కన్వీనర్ శైలేంద్ర దూబే అసంబద్ధంగా విమర్శించారు. ‘సాధారణంగా ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎస్మాను తీసుకొని వస్తుంది. అయితే ఇక్కడ ఉద్యోగులు ఎలాంటి సమ్మె నోటీసు ఇవ్వలేదు’ అని అన్నారు. ఉద్యోగుల ప్రజాస్వామిక హక్కులను కాలరాసే ప్రయత్నంలో భాగంగానే ఎస్మాను తీసుకొచ్చారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓపీఎస్ అంశంపై ఉద్యోగులు సమ్మె నోటీసు ఇస్తారనే భయంతోనే యోగి ప్రభుత్వం ఎస్మాను తీసుకొచ్చిందని తెలిపారు.
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల జాతీయ స్థాయి సంఘమైన రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎం) జాతీయ అధికార ప్రతినిధి వీరేంద్ర మిశ్రా మీడియాతో మాట్లాడుతూ ‘ఈ ప్రభుత్వం ఉద్యోగులకు వ్యతిరేకి. కొన్నేండ్ల నుంచి నిరసనలు చేస్తున్నా ఒపిఎస్‌ను పునరుద్దరించడంలేదు’ అని విమర్శిం చారు. ఎస్మా లేదా సెక్షన్ 144 విధించిన మా ప్రజాస్వామ్య హక్కుల కోసం మేం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.