అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం

On Anganwadis The Esma experiment– ఏపీ ప్రభుత్వ నియంతృత్వ పోకడ
అమరావతి : తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్‌లో 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ చర్యలకు పూనుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న వారిపై ఎస్మా ప్రయోగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నెంబర్‌ 2ను విడుదల చేసింది. ఆరు నెలలపాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు సమ్మె చేసిన కాలానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత విధించింది. దాదాపు రూ.3వేలు తగ్గించి.. రూ.8,050 వేతనాన్ని వారి ఖాతాల్లో జమచేసింది. ‘ఎస్మా’ అనేది ‘ఎసెన్సియల్‌ సర్వీసెస్‌ మెయిన్‌టీనెన్స్‌ యాక్ట్‌’కు సంక్షిప్త రూపం. 1981లో రూపొందించిన చట్టమిది. ఇది సమ్మెలు, హర్తాళ్లు వంటి సందర్భాల్లో ప్రజల సాధారణ జీవనం సాఫీగా సాగేందుకు తోడ్పడే సర్వీసులకు భంగం కలగకుండా ఈ చట్టం ఉపయోగపడుతుంది. అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మెలోకి దిగితే.. జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రభుత్వానికి ఈ చట్టాన్ని ప్రయోగించే అధికారం ఉంటుంది.