– తక్షణమే వెనక్కి తీసుకోవాలి..వారితో సర్కారు చర్చించాలి
– స్కీమ్ వర్కర్ల అనుబంధ సంఘాల సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగించడం సరిగాదనీ, జగన్ సర్కారు దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలతో ఏపీ ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల స్కీమ్ వర్కర్ల అనుబంధ యూనియన్ల సమావేశం ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రేమపావని అధ్యక్షతన జరిగింది. అందులో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఉపాధ్యక్షులు ఎస్వీ.రమ, పి.జయలక్ష్మి, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు ప్యారీజాన్ మాట్లాడారు. ఏపీలో అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మెకు వారు మద్దతు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఎస్మా జీవో నెంబర్ 2ను తక్షణమే రద్దు చేయాలనీ, ఇప్పటికైనా జగన్ ప్రభుతం తన విధానాన్ని మార్చుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వ పథకాల నిర్వహణను ప్రయివేటు సంస్థలకు అప్పగించడాన్ని మానాలని సూచించారు. పథకాలను సంస్థాగతం చేయాలనీ, అందులో పనిచేసే కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. వారికి కనీస వేతనం రూ.26 వేలు, పెన్షన్, ఉద్యోగ భద్రత, పీఎఫ్ తదిరత డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. కేంద్ర కార్మిక ఉద్యోగ ,రైతు సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ, స్కీం వర్కర్లందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.