– సమ్మెకు సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్‌లో ఐసీడీఎస్ శాఖలో పనిచేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు, టీచర్లపై విధించిన ఎస్మాను వెంటనే ఎత్తేయాలని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. వేతనాల పెంపు, గ్రాట్యూటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగించడాన్ని నిరసిస్తూ ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ భూపాల్, జె.వెంకటేష్, ఎస్.రమ, పి.జయలకీë, వంగూరు రాములు, వీఎస్.రావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, బి.మధు, ఎ.ముత్యంరావు, బి.మల్లేష్, కె.గోపాలస్వామి, పద్మశ్రీ, కూరపాటి రమేష్, ఎం.వెంకటేష్, కె.ఈశ్వర్‌రావు, జె.మల్లికార్జున్, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సాయిబాబు, చుక్కరాములు, పాలడుగు భాస్కర్ మాట్లా డుతూ..అంగన్‌వాడీ డిమాండ్ల పట్ల ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. ప్రభుత్వ మొండివైఖరి వల్లనే ఏపీలో అంగన్‌వాడీలు సమ్మె బాట పట్టారని తెలిపా రు. డిమాండ్లను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరిం చాల్సిన ప్రభుత్వం సమ్మెను అణచివేయడానికి ఎస్మాను ప్రయోగించడం దారుణమని విమర్శించారు. ఇది జగన్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు నిదర్శనమని విమర్శిం చారు. ఎస్మాను తక్షణమే ఎత్తేయాలని డిమాండ్ చేశారు.