నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట నియోజక వర్గం కేంద్రంగా ఆయిల్ ఫాం రీఫైనరీ పరిశ్రమను,పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురామిరెడ్డి,ఎమ్మెల్యే జారే ఆదినారాయణ లకు తెలంగాణ ఆయిల్ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ ఫాం గ్రోవర్స్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు తుంబూరు మహేశ్వర రెడ్డి,కొక్కెరపాటి పుల్లయ్య లు వినతి పత్రం అందజేసారు. జాతీయ క్రీడలు దినోత్సవం పురస్కరించుకుని నిర్మించ తలపెట్టిన ఇండోర్ స్టేడియం శంకుస్థాపనకు గురువారం వారిరువురు అశ్వారావుపేట వచ్చిన సందర్భంగా పుల్లయ్య వారిని స్వయంగా కలిసి వినతి పత్రం అందజేసారు.
ఆ వినతి పత్రం సారాంశం యథాతథం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1 లక్ష 25 వేల ఎకరాలకు పైగా పామాయిల్ సాగు అవుతున్నది.ఈ ఆయిల్ఫామ్ తోటల నుండి వచ్చే గెలల నుండి ముడి పామాయిల్ ఉత్పత్తి అశ్వారావుపేట మరియు అప్పారావుపేట ఫ్యాక్టరీల లో తయారు చేస్తున్నారు.దీనికి అనుబంధంగా ఖమ్మం జిల్లా, వేంసూరు మండలం, కొల్లూరు గూడెం గ్రామంలో మరో ఫ్యాక్టరీ నిర్మాణం జరగబోతుంది.భవిష్యత్తులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉత్పత్తి అయ్యే ముడి పామాయిల్ ను రిఫైనరీ చేసి ఇక్కడి నుండే ప్యాకింగ్ చేయడం ద్వారా రైతులకు ఆదాయం చేకూర్చే అవకాశం ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతున్న పామాయిల్ తోటల విస్తరణకు అనుగుణంగా భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందుల నుండి రైతులను కాపాడుకోవడం కోసం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలకు అనుబంధంగా ఆయిల్ ఫామ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయించి గలరని కోరుచున్నాము.అదే రీసెర్చ్ సెంటర్లోనే ఒక టన్ను పామాయిల్ గెలలు మిల్లు ఆడేందుకు ఏర్పాటు చేయడం ద్వారా ఆయిల్ రికవరీ శాతం తెలుసుకొనుటకు అవకాశం ఉంటుంది.కాబట్టి పై అంశాలను పరిశీలించి తెలంగాణ ఆయిల్ ఫామ్ రైతాంగానికి సహాయపడే గలరని కోరుచున్నాము.