జిల్లా వ్యాప్తంగా 236 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

– రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత
నవతెలంగాణ – తుంగతుర్తి
ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని,ప్రభుత్వ మద్దతు ధరలు పొందాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత అన్నారు. సోమవారం మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.జిల్లా వ్యాప్తంగా మొత్తం 236 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.ఇప్పటివరకు 72 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు.ఈ మేరకు రైతులతో మాట్లాడి ధాన్యానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తెచ్చి ప్రభుత్వ మద్దతు ధర ఏ గ్రేడ్ ధాన్యానికి రూ 2203, బి గ్రేడ్ ధాన్యానికి రూ 2183 చెల్లించనున్నట్లు తెలిపారు.ధాన్యంలో తేమశాతం 17 ఉండాలని రైతులకు సూచించారు. అలాగే వేసవి దృష్ట్యా రైతులకు నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు,ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు,నీడ కోసం టెంట్లు కుర్చీలు తదితర మౌలిక వసతులు కల్పించాలని అన్నారు.తూకంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సరైన విధంగా నిర్వహించాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారి మోహన్ బాబు,తహసిల్దార్ రమణారెడ్డి, వ్యవసాయశాఖ మండలఅధికారి బాలకృష్ణ,ఎం పి ఓ భీమ్ సింగ్ నాయక్,ఏ ఈ ఓ లక్ష్మీ ప్రసన్న,ఏపిఎం పొడిశెట్టి నరసయ్య,సీసీలు గడ్డం గిరి,నర్సింగ్ నాయక్ పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు,విబికేలు రైతులు తదితరులు పాల్గొన్నారు.