ఈయూ పార్లమెంట్‌ చర్చించింది

– కానీ ప్రధాని నోట మాట లేదు : మణిపూర్‌పై రాహుల్‌
న్యూఢిల్లీ : హింసాకాండతో మణిపూర్‌ అట్టుడుకుతుంటే దానిపై ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. ‘మణిపూర్‌ తగలబడిపోతోంది. భారత ఆంతరంగిక వ్యవహారంపై యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంట్‌ చర్చించింది. కానీ ప్రధాని నోటి వెంట ఒక్క మాట కూడా రావడం లేదు. రఫేల్‌ విమానం టికెట్‌తో ఆయన బాస్టిల్‌ డే పెరేడ్‌కు వెళ్లారు’ అని రాహుల్‌ శనివారం ట్వీట్‌ చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మోడీ ఫ్రాన్స్‌ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ గౌరవ అతిథిగా బాస్టిల్‌ డే పెరేడ్‌కు హాజరయ్యారు. ఈ విషయాన్ని రాహుల్‌ తన ట్వీట్‌లో ప్రస్తావించారు. కాగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ కూడా కేంద్రంపై విరుచుకుపడ్డారు. మణిపూర్‌ సమస్యను పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ‘మనం చంద్రుని పైకి వెళ్లగలం. కానీ స్వదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను పరిష్కరించడానికి ఇష్టపడడం లేదు’ అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.