మెటాకు ఈయూ రూ.10వేల కోట్ల జరిమానా

శాన్‌ఫ్రాన్సిస్కో : ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటాకు యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ఎజెన్సీ భారీ షాక్‌ ఇచ్చింది. ఈయూ వినియోగ దారులకు చెందిన ఫేస్‌బుక్‌ డేటాను అమెరికాలోని సర్వర్లకు అక్రమంగా బదిలీ చేసిందనే అరోపణలపై యురోపియన్‌ డేటా ప్రొటెక్షన్‌ బోర్డు (డీపీసీ) భారీ జరిమానా విధించింది. జనరల్‌ డేటా ప్రొటెక్షన్‌ రెగ్యూలే షన్‌ను మెటా ఉల్లంఘించినందున 1.2 బిలియన్‌ యూరోలు (దాదాపు రూ.10వేల కోట్లు) జరిమానా చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. వినియోగదారుల ప్రాథమిక హక్కులను మెటా హరించివేసిందని తెలిపింది. ఈ అంశంలో ఇంతక్రితం యూరోపియన్‌ యూనియన్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ ఆదేశాలను కూడా మెటా పట్టించుకోలేదని డీపీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్‌ కల్లా యూరప్‌ వినియోగదారుల డేటాను అమెరికాకు బదిలి చేయడాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.