అమెరికా ఉక్రెయిన్‌ విధానంతో కుదేలైన ఐరోపా దేశాలు

అమెరికా ఉక్రెయిన్‌ విధానంతో కుదేలైన ఐరోపా దేశాలురష్యాకు, ఉక్రెయిన్‌కు మధ్య జరుగుతున్న యుద్ధంపై అమెరికా అనుసరిస్తున్న విధానం ఐరోపాను కుంగదీసిందని హంగరీ అధ్యక్షుడి ప్రధాన సలహాదారు అన్నారు. కూటములు కట్టే విధానం వర్తమాన పరిస్థితికి పరిష్కారం కాదని బలజ్‌ ఓర్బాన్‌ తన నూతన గ్రంథావిష్కరణ సందర్భంగా తెలిపాడు. నాటోలోనూ, యూరోపియన్‌ యూనియన్‌లోనూ సభ్య దేశంగావున్న హంగరీకి ఇది ప్రమాదకరంగా పరిణమించిందని, హంగరి అభివద్ధి చెందటానికిగల అనేక అవకాశాలను అందుబాటులో లేకుండా చేసిందని ఆయన వివరించారు. కూటములు కట్టటం అమెరికాకు కూడా ఉపయోగపడదని, అది ప్రపంచంలో మార్పును వేగవంతం చేస్తుందని కూడా అన్నారు. 2022లో మాస్కోపైన ఆంక్షలు విధించటంలోనూ ఉక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేయటంలోనూ రష్యా నుంచి దిగుమతయ్యే ఇంధనాన్ని తిరస్కరించటంలోనూ అమెరికాతో యూరోపియన్‌ చేరింది. తత్ఫలితంగా 2023లో నాటో కూటమి దేశాల ఆర్థిక వ్యవస్థలు మాంధ్యంలోకి జారుకునే స్థితికి చేరాయి. వర్తమానంలోని పారిశ్రామిక విప్లవాలు సాంకేతిక పరిజ్ఞానంపై ఆధాపడి వుంటాయి. అందుకోసం ముడి సరుకులు కావాలి. అవి ఐరోపాలో లభ్యంకావు. అది ఐరోపా ఖండం బలహీనతగా బయటపడుతుందని ఆయన హెచ్చరించాడు. మరోవైపు అమెరికా నాయకత్వంలో ఐరోపా విధించిన ఆంక్షలతో రష్యా పతనం కాలేదు. ఆ దేశం తన ఆర్థిక వ్యవస్థ దిశను మార్చి చైనాతో తన సంబంధాలను బలోపేతం చేసిందని ఓర్బాన్‌ చెప్పాడు. యూరోపియన్‌ యూనియన్‌, బాల్కన్‌ దేశాలకు ముఖద్వారంగావున్న హంగరి రానున్న రోజుల్లో తన ఆర్థిక వ్యవస్థను విజయవంతంగా నడపటానికి తన సార్వభౌమత్వాన్ని బలోపేతం చేసుకోవలసివుంటుందని కూడా ఓర్బాన్‌ చెప్పాడు. 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో హంగరి తటస్థ వైఖరిని తీసుకుంది. హంగరి రష్యా సైనిక చర్యను ఖండించినప్పటికీ ఉక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేయటానికి నిరాకరించింది. అంతేకాకుండా దౌత్యనీతితో మాత్రమే ఉక్రెయిన్‌ సమస్య పరిష్కారం అవుతుందని హంగరీ ప్రకటించింది.