నిమిషం ఆలస్యమైనా అనుమతించం

– నేటినుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం
– ఏర్పాట్లన్నీ పూర్తి : ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమవుతాయని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ చెప్పారు. ఈ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేశామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ ప్రథమ సంవత్సరం నుంచి 4,82,677 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 4,65,022 మంది కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని వివరించారు. రాష్ట్రంలో 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 1,473 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 1,473 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, 26,333 మంది ఇన్విజిలేటర్లు, 75 మంది ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు, 200 మంది సిట్టింగ్‌ స్క్వాడ్‌లను నియమించామని చెప్పారు. జిల్లా కలెక్టర్లు చైర్మెన్లుగా జిల్లా హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. డీఐఈవో నేతృత్వంలో జిల్లా పరీక్షల కమిటీని నియమించామని వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆదేశించారు. మెడికల్‌ కిట్‌తో ఏఎన్‌ఎం అందుబాటులో ఉండాలని కోరారు. కింద కూర్చుని పరీక్షలు రాయొద్దనీ, అవసరమైన డెస్క్‌లుండేలా చూడాలని సూచించారు. కరెంటు కోతల్లేకుండా చూడాలని విద్యుత్‌ శాఖను కోరారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ప్రత్యేక బస్సులుండాలని ఆర్టీసీ అధికారులకు సూచించామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలుండాలనీ, వాటి పర్యవేక్షణలోనే ప్రశ్నాపత్రాలను ఓపెన్‌ చేయాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో ప్రతి తరగతి గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రశ్నాపత్రాలను ఇప్పటికే పరీక్షా కేంద్రాలున్న ప్రాంతాలకు తరలించామని చెప్పారు. రాష్ట్రస్థాయిలో 040-24600110, 040-24655027 నెంబర్లతో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని వివరించారు. ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఎనిమిది వరకు ఉద్యోగులు అందుబాటులో ఉంటారని అన్నారు. జిల్లాస్థాయిలోనూ కలెక్టర్లు కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేస్తారని చెప్పారు. హాల్‌టికెట్లు ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం సోమవారం నుంచే కల్పించామన్నారు. కాలేజీ ఇచ్చిన హాల్‌టికెట్లు లేదా డౌన్‌లోడ్‌ చేసుకున్న వాటిని పరీక్షలకు అనుమతించాలని సూచించారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులకు అనుమతి ఉంటుందని చెప్పారు. 8.45 నుంచి తొమ్మిది గంటల వరకు ఓఎంఆర్‌ పత్రాలను అందజేస్తామన్నారు. తొమ్మిది గంటలకే ప్రశ్నాపత్రాలను విద్యార్థులకు ఇస్తామని అన్నారు. తొమ్మిది గంటల వరకే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇస్తామనీ, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమనీ స్పష్టం చేశారు. సెల్‌ఫోన్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, కాలిక్యులేటర్లకు అనుమతి లేదన్నారు. ఇన్విజిలేటర్లు కూడా సెల్‌ఫోన్లు తెచ్చుకోవద్దని కోరారు. ఆన్‌లైన్‌ మూల్యాంకనానికి సంబంధించి రెండు సంస్థలు బిడ్లను దాఖలు చేశాయని వివరించారు. వాటిపై కసరత్తు చేస్తున్నామని అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటామనీ, టెలీమానస్‌ 14416ను ఏర్పాటు చేశామనీ చెప్పారు.