ధోని దంచికొట్టినా..!

12 బంతుల్లో 40 పరుగులు అవసరం. క్రీజులో ధోని, జడేజా. సూపర్‌కింగ్స్‌ వైపు మొగ్గు. 19వ ఓవర్లో హౌల్డర్‌ 19 పరుగులు సమర్పించుకోగా.. చివరి ఓవర్లో 21 పరుగులు కావాలి. తొలి మూడు బంతులకు ధోని 14 పరుగులు పిండుకున్నాడు. మూడు బంతుల్లో 7 పరుగులే కావాలి. ఒత్తిడి సందీప్‌ శర్మపైనే ఉంది. కండ్లుచెదిరే యార్కర్లు సంధించిన చివరి మూడు బంతులకు ఒక్క బౌండరీ ఇవ్వలేదు. ధోని (32 నాటౌట్‌, 17 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు), జడేజా (25 నాటౌట్‌, 15 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) మెరిసినా సూపర్‌కింగ్స్‌ 3 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. డెవాన్‌ కాన్వే (50), రహానె (31) రాణించినా.. ఆరంభం నుంచీ చెన్నై ఇన్నింగ్స్‌ నెమ్మదిగా సాగింది. చివరి ఓవర్లలో సాధించాల్సిన రన్‌రేట్‌ భారీగా ఉండటం సూపర్‌కింగ్స్‌పై ప్రభావం చూపింది. రాయల్స్‌ స్పిన్నర్లు అశ్విన్‌ (2/25), చాహల్‌ (2/27) చెన్నైని గట్టి దెబ్బకొట్టారు. ఈ మ్యాచ్‌తో చెన్నైకి సారథిగా ధోని 200వ మ్యాచ్‌ ఆడాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు చేసింది. జోశ్‌ బట్లర్‌ (52, 36 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో మెరువగా.. దేవదత్‌ పడిక్కల్‌ (38) తొలి పది ఓవర్లలో రాయల్స్‌ స్కోరును నడిపించారు. జడేజా (2/21) మాయజాలంతో రాయల్స్‌ జోరు తగ్గినా.. అశ్విన్‌ (30), హెట్‌మయర్‌ (30 నాటౌట్‌) మెరుపులతో రాజస్థాన్‌ మంచి స్కోరు నమోదు చేసింది.