లింగ వివ‌క్ష ఇబ్బంది పెట్టి‌నా…

పంకజ్‌ బదౌరియా… భారతదేశంలోనే మొట్టమొదటి మాస్టర్‌చెఫ్‌. ఇప్పుడు దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా తన పాకశాస్త్ర ప్రభావాన్ని విస్తరించారు. కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం, న్యూయార్క్‌లోని వర్లీ ఫుడ్‌ ఫెస్టివల్‌, బీబీసీ సిరీస్‌ వంటి ప్రతిష్టాత్మక ప్లాట్‌ఫారమ్‌ల నుండి వచ్చిన ఆహ్వానాలతో విదేశాలలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్త వర్క్‌షాప్‌లు, మాస్టర్‌ క్లాస్‌లు, ఫుడ్‌ ఫెస్టివల్స్‌తో భారతీయ వంటకాల చక్కదనాన్ని, రుచిని విదేశీయులకు అందిస్తున్న ఆమె పరిచయం ఆమె మాటల్లోనే…
చిన్నతనంలో కూడా అంటే చెఫ్‌ అంటే ఏమిటో తెలియనప్పుడు, ఆహార తయారీ కూడా వృత్తిగా ఉంటుందని తెలియనప్పుడే ఆహారంతో నిత్యం ఏదైనా కొత్తగా చేయాలని కోరుకున్నాను. బహుశా మంచి ఆహారం పట్ల నాకున్న అభిమానమే దాని వెనుక ఉన్న ప్రేరణ అనుకుంటా. నా తల్లిదండ్రులు ఇద్దరూ వంట అద్భుతంగా చేసేవారు. నిజానికి అమ్మ పెళ్లయిన తర్వాతనే నాన్న, అమ్మమ్మ దగ్గర వంట నేర్చుకుంది. బంధువులు, చుట్టుపక్కల వారు మా ఇంట్లో పార్టీలకు రావడానికి ఎప్పుడూ ఎదురు చూస్తుండేవారు. ఎందుకంటే మా ఇంట్లో వండే వంటలు, వాటి ప్రదర్శన అద్భుతంగా ఉంటుందని వారందరికీ తెలుసు. అదే నాకు స్ఫూర్తినిచ్చింది. అమ్మా, నాన్న ఇద్దరూ కలిసి వంట చేయడం, నేను కూడా అమ్మకు వంటగదిలో సహాయం చేస్తూ వంట నేర్చుకున్నాను. అయితే మొదట్లో నేను వంటను వృత్తిగా తీసుకోలేకపోయాను. అయితే కొన్నేండ్ల తర్వాత మాస్టర్‌చెఫ్‌ ఇండియా కార్యక్రమం నా జీవిత గమనాన్ని మార్చివేసింది.
వ్యాపారవేత్తగా మారాలని
2010లో మాస్టర్‌చెఫ్‌ ఇండియాను గెలుచుకున్న తర్వాత నాలో నమ్మకం వచ్చింది. వ్యాపారవేత్తగా మారాలని నిర్ణయించుకున్నాను. దాంతో ఆగస్ట్‌ 2012లో పంకజ్‌ బదౌరియా క్యులినరీ అకాడమీని స్థాపించాను. నా స్వస్థలం లక్నోలో దీన్ని ప్రారంభించాను. వర్ధమాన చెఫ్‌లకు శిక్షణ ఇవ్వాలని, వారి కలల వృత్తిని ప్రారంభించడంలో వారికి సహాయపడాలని కోరుకున్నాను. నన్ను చాలా అందంగా స్వాగతించిన పరిశ్రమకు తిరిగి ఇచ్చే మార్గం కూడా ఇదే అని బలంగా నమ్మాను. నా కల నెరవేర్చుకోవడానికి నా భర్త కూడా తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. వాస్తవానికి ఆయన సపోర్ట్‌ లేకుండా నేను ఇదంతా చేయలేను.
ఎలాంటి అనుభవం లేదు
ఈ రంగంలోకి రాక ముందు నాకు 16 ఏండ్ల బోధనా అనుభవం ఉంది. వ్యాపారవేత్తగా ఎలాంటి అనుభవం లేదు. ఏదైనా హోటల్‌లో చెఫ్‌గా చేరడం కంటే ఇదే మంచి పద్ధతి అని నిర్ణయించుకున్నాను. అయితే నా భర్త ఎంబీఏ చేశాడు. ఆయన చదువు మా వ్యాపారానికి ఎంతో ఉపయోగపడింది. అతనికి ఉన్న పరిజ్ఞానంతో అకాడమీని ప్లాన్‌ చేయడం, అమలు చేయడం, నడిపించే బాధ్యత అతని భుజాలపై పడింది. నేను అకడమిక్‌ నిర్మాణాన్ని ప్లాన్‌ చేస్తున్నప్పుడు, నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ సృష్టికి సంబంధించిన అన్ని ఇతర వివరాలను అతను ప్లాన్‌ చేసి అమలు చేసేవాడు. ఇలా నా భర్త నాకు అన్ని విధాల సపోర్ట్‌గా నిలబడ్డాడు.
ఏడు పుస్తకాలు రాశాను
వర్ధమాన చెఫ్‌లకు శిక్షణ ఇవ్వడంతో పాటు టెలివిజన్‌ కుకరీ షోలను హోస్ట్‌ చేస్తున్నాను. అలాగే వంటల పుస్తకాలు కూడా రాశాను. (ఇప్పటి వరకు ఏడు). నా అకాడమీకి సమయం కేటాయించడం, ప్రపంచాన్ని పర్యటించడం, స్పీకర్‌గా ఆహ్వానం పొందడం ఇలా అసంఖ్యాక ఈవెంట్‌లు, సెమినార్‌లు, TEDx సెషన్‌లతో పాటు సోషల్‌ మీడియా ఇప్పుడు చాలా పెద్ద విషయంగా మారిపోయింది. నా సొంత స్టూడియో కూడా ప్రారంభించాను. దీని అధ్వర్యంలో వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా భాగస్వామ్యం చేయడానికి కంటెంట్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించాను.
నా పనే వారికి సమాధానం
స్త్రీలు ఎంత చేసిన ప్రజలు గుర్తించడం చాలా కష్టం. అలాగే నేను కొంతమందికి ‘ఒక ప్రదర్శనలో విజేతను మాత్రమే’. అది నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. కానీ నేను వారి మాటలను లైట్‌గా తీసుకున్నాను. అలాంటి వారి వద్ద నేను ఏదో సాధించి నిరూపించాల్సిన అవసరం లేదు. అయితే తర్వాత కాలంలో నా పనే వారికి సమాధానం చెప్పింది. చివరికి వారు కూడా నన్ను వ్యాపారం తెలిసిన స్త్రీని అని అంగీకరించారు. నా ప్రయాణంలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. అలాగే కొన్ని ఆహ్లాదకరమైనవీ ఉన్నాయి. అన్నింటి కంటే మహిళల పట్ల ఉన్న లింగ వివక్ష నన్ను ఇబ్బంది పెడుతుంది. అయితే నేను ఆ వివక్షను ఎదిరించి దాని కంటే పైకి ఎదగగలుగుతున్నాను అనేది మాత్రం వాస్తవం.
కండ్లు తెరిచి కష్టపడండి
సమాజం నుండి నేను పొందిన ప్రేమ, ఆప్యాయత, గుర్తింపుతో నా హృదయం బరువెక్కిపోయింది. అయితే ఇది ఇలా దీర్ఘకాలం ఉంటుందని నేను ఊహించలేదు. నా ఆనందం, నా మొత్తం ఉనికి, నా మొత్తం పని, నా ఆనందం అన్నీ నా పిల్లలకు సంబంధించినవి. వారి అందమైన ముఖాలు నా కష్టాన్ని మర్చిపోయేలా చేస్తాయి. ఎప్పుడైనా పని ఒత్తిడిగా అనిపించినప్పుడు నాకెంతో ఇష్టమైన కవి రాబర్ట్‌ ఫ్రాస్ట్‌ రచించిన కొన్ని పంక్తులు గుర్తు చేసుకుంటాను. అవి నన్ను ముందుకు సాగమని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంటాయి. నేను నేటి యువతకు చెప్పేది ఒక్కటే. కలలు కనండి! దయచేసి కలగనండి! కలలు మనకు జీవించడానికి, ఆకాంక్షించడానికి, సాధించడానికి ఓ కారణాన్ని ఇస్తాయి! అయితే మీరు కండ్లు మూసుకుని కనే కలలు ఏవైనా, వాటిని సాధించడానికి మాత్రం మీ కండ్లు తెరిచి కష్టపడండి!.