– నేటితో ముగియనున్న కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ గడువు
– 2న తీహార్ జైలులో లొంగిపోనున్న ఢిల్లీ సీఎం
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు నేటి (శనివారం)తో ముగియనుంది. రేపు (ఆదివారం) జూన్ 2న ఆయన తీహార్ జైల్లో పోలీసులకు తిరిగి లొంగిపోనున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి పార్టీ అధినేతగా తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన సుప్రీం తలుపుతట్టిన విషయం తెలిసిందే. విచారించిన ధర్మాసనం ఆయనకు 21 రోజులపాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. గడువు ముగియనుండటంతో రేపు ఆయన తిరిగి తీహార్ జైల్‌కి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ ”నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుంది. ధర్మాసనం ఇచ్చిన బెయిల్ గడువు నేటితో ముగిసిపోతుంది. తిరిగి పోలీసులకు లొంగిపోతున్నా. ఈసారి నన్ను ఎన్ని రోజులు జైల్లో ఉంచుతారో తెలియదు. నన్ను మాట్లాడనివ్వకుండా భయపెట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నించారు. 20ఏండ్లుగా డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్నా. 10 ఏండ్లుగా ఇన్సులిన్ తీసుకుంటున్నా. రోజు నాలుగు ఇంజక్షన్లు తీసుకుంటా. జైల్లో నాకు ఇన్సులిన్ ఇవ్వలేదు. దీంతో షుగర్ లెవల్స్ 300-325 వరకు వెళ్లాయి. వీళ్లు నా నుంచి ఏం కోరుకుంటున్నారో అర్థం కావడం లేదు. జైల్లో 50 రోజులు ఉన్నాను. ఆరు కేజీల బరువు తగ్గా. శరీరంలో ఇతర ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చి ఉండొచ్చు. పరీక్షలు చేయాలని వైద్యులు చెబుతున్నారు. యూరిన్‌లో కీటోన్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే బెయిల్ గడువు పొడిగించాలని రిక్వెస్ట్ చేశా. ఢిల్లీ ప్రజలు సంతోషంగా ఉంటే కేజ్రీవాల్ సంతోషంగా ఉంటాడు. నేను మీ మధ్య లేకపోయినా అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతాయి” అని కేజ్రీ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.