చినుకు పడలే..అయినా ఆట రద్దు

Can't drip..but the game is cancelled– తడి అవుట్‌ఫీల్డ్‌తో సాగని ఆట
– భారత్‌, బంగ్లాదేశ్‌ రెండో టెస్టు
నవతెలంగాణ-కాన్పూర్‌
భారత్‌, బంగ్లాదేశ్‌ రెండో టెస్టులో వరుసగా రెండో రోజు ఆట సాధ్యపడలేదు. తొలి రోజు వెలుతురు లేమి, వర్షంతో మధ్యాహ్నం ఆట నిలిచిపోగా.. రెండో రోజు భారీ వర్షంతో 90 ఓవర్ల ఆట వర్షార్పణమైంది. కానీ మూడో రోజు ఒక్క చినుకు పడలేదు. అయినా, గ్రీన్‌పార్క్‌ స్టేడియంలో ఆట సాధ్యపడలేదు. తడి అవుట్‌ఫీల్డ్‌ కారణంగా మూడో రోజు ఆట రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. కాన్పూర్‌ టెస్టులో మూడు రోజులు ముగియగా.. బంగ్లాదేశ్‌ 35 ఓవర్లలో 107/3తో నిలిచింది. టెస్టు మ్యాచ్‌లో మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 8 సెషన్ల ఆట తుడిచి పెట్టుకుపోగా కాన్పూర్‌ టెస్టులో ఇక ఫలితం తేలటం కష్టమనే చెప్పాలి.
నిర్వహణ వైఫల్యం: గ్రీన్‌పార్క్‌ స్టేడియం సిబ్బంది వైఫల్యం సుస్పష్టం. ఆదివారం వర్షం చినుకు కూడా కురవలేదు. అయినా, గ్రౌండ్స్‌మెన్‌ 10 గంటలకు కవర్లను తొలగించారు. అవుట్‌ఫీల్డ్‌లో మిడ్‌ ఆన్‌, మిడ్‌ ఆఫ్‌, మీడియా బాక్స్‌ ఎండ్‌లో బౌలర్ల రనప్‌ బాగా తడిగా ఉన్నాయి. దీంతో అంపైర్లు క్రిస్‌ బ్రౌన్‌, రిచర్డ్‌ అవుట్‌ఫీల్డ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తడిగా ఉన్న ప్రదేశాలను మెరుగు పర్చేందుకు గ్రౌండ్స్‌మెన్‌ ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. సూర్యుడే ఆ పని చేసుకోవాలనే రీతిలో వ్యవహరించారు. ఆదివారం కావటంతో అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి వచ్చినా నిరాశ తప్పలేదు. మధ్యాహ్నం 2 గంటలకు మూడో రోజు ఆటను రద్దు చేసినట్టు అంపైర్లు ప్రకటించారు. ఆ వెంటనే సూర్యుడు తొంగిచూడటం అభిమానులను మరింత అసంతృప్తికి లోనుచేసింది.