పడగొట్టినా..తోక మిగిలే!

Even if it is knocked down..the tail remains!– బుమ్రా నాలుగు వికెట్ల ప్రదర్శన
– లబుషేన్‌, కమిన్స్‌ ప్రతిఘటన
– ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ 228/9
– భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 369/10
– బాక్సింగ్‌ డే టెస్టు నాల్గో రోజు
నవతెలంగాణ-మెల్‌బోర్న్‌
జశ్‌ప్రీత్‌ బుమ్రా (4/56), మహ్మద్‌ సిరాజ్‌ (3/66) నిప్పులు చెరిగారు. బుమ్రా మిడిల్‌ ఆర్డర్‌ను కకావికలం చేయగా.. టాప్‌ ఆర్డర్‌ సంగతి సిరాజ్‌ చూసుకున్నాడు. కానీ, మార్నస్‌ లబుషేన్‌ (70, 139 బంతుల్లో 3 ఫోర్లు), పాట్‌ కమిన్స్‌ (41, 90 బంతుల్లో 4 ఫోర్లు), నాథన్‌ లయాన్‌ (41 నాటౌట్‌, 54 బంతుల్లో 5 ఫోర్లు) రాణించటంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు దిశగా సాగుతోంది. 82 ఓవర్లలో 9 వికెట్లకు 228 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.. నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి 333 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు, నితీశ్‌ కుమార్‌ రెడ్డి (114, 189 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌), వాషింగ్టన్‌ సుందర్‌ (50) రాణించటంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 369 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా 105 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కించుకుంది. ఆసీస్‌ బౌలర్లు పాట్‌ కమిన్స్‌, స్కాట్‌ బొలాండ్‌, నాథన్‌ లయాన్‌లు మూడేసి వికెట్లు పడగొట్టారు.
బుమ్రా, సిరాజ్‌ అదుర్స్‌
ఆసీస్‌ పర్యటనలో సిరాజ్‌ నిలకడగా విఫలమయ్యాడు. మెల్‌బోర్న్‌లో కీలక సమయంలో సిరాజ్‌ వికెట్ల వేట సాగించటం భారత్‌కు కలిసొచ్చింది. ఆసీస్‌ యువ ఓపెనర్‌ శామ్‌ కాన్‌స్టాస్‌ (8)ను క్లీన్‌బౌల్డ్‌ చేసిన బుమ్రా.. భారత్‌కు అదిరే బ్రేక్‌ అందించాడు. మరో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా (21)ను సాగనంపి సిరాజ్‌ వికెట్ల వేటలో జత కలిశాడు. బుమ్రా, సిరాజ్‌ జోరుతో ఉదయం సెషన్లోనే ఆసీస్‌ ఓపెనర్లను కోల్పోయింది. లంచ్‌ విరామానికి 53/2తో నిలిచింది. ఓ ఎండ్‌లో మార్నస్‌ లబుషేన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ నిర్మించే పనిలో పడిన స్టీవ్‌ స్మిత్‌ (13) సిరాజ్‌ అవుట్‌ చేయటంతో.. మిడిల్‌ ఆర్డర్‌ కథ బుమ్రా ముగించాడు. అక్కడ్నుంచి వరుస ఓవర్లలో వికెట్లు పడ్డాయి. బుమ్రా ఒకే ఓవర్లో ప్రమాదకర ట్రావిశ్‌ హెడ్‌ (1), మిచెల్‌ మార్ష్‌ (0)లను అవుట్‌ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ కేరీ (2) వికెట్లను గాల్లో ఎగరేశాడు. 80/2తో సాఫీగా సాగుతున్న ఆసీస్‌ ఇన్నింగ్స్‌.. బుమ్రా దెబ్బకు 91/6తో కష్టాల్లో కూరుకుంది.
మెరిసిన లబుషేన్‌
బ్యాటింగ్‌ లైనప్‌లో అందరూ విఫలమైనా.. మార్నస్‌ లబుషేన్‌ (70) నిలబడ్డాడు. బుమ్రా బుల్లెట్ల ఒత్తిడిని తట్టుకుని వికెట్‌ కాపాడుకున్నాడు. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ (41)తో కలిసి లబుషేన్‌ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. 105 బంతుల్లో 2 ఫోర్లతో మరో అర్థ సెంచరీ సాధించాడు. కమిన్స్‌, లబుషేన్‌ ఏడో వికెట్‌కు 116 బంతుల్లోనే 57 పరుగులు జోడించారు. లబుషేన్‌ను సిరాజ్‌ అవుట్‌ చేయటం, మిచెల్‌ స్టార్క్‌ (5) రనౌట్‌తో ఆసీస్‌ కథ ముగిసిందనే అనుకున్నారు. కానీ కమిన్స్‌ తరహాలో నాథన్‌ లయాన్‌ (41 నాటౌట్‌) దంచికొట్టాడు. స్కాట్‌ బొలాండ్‌ (10 నాటౌట్‌)తో కలిసి పదో వికెట్‌కు అజేయంగా 55 పరుగులు జోడించాడు. దీంతో ఆసీస్‌ ఆధిక్యం 333 పరుగులకు చేరుకుంది. నాల్గో రోజు ఆట ఆఖర్లో బుమ్రాకు లయాన్‌ చిక్కినా.. నో బాల్‌ తప్పిదంతో భారత్‌కు నిరాశ తప్పలేదు. స్లిప్స్‌లో రాహుల్‌ నాటకీయంగా క్యాచ్‌ అందుకున్నా..
నో బాల్‌తో లయాన్‌ బతికిపోయాడు.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : 474/10
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 369/10
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ : శామ్‌ కాన్‌స్టాస్‌ (బి) బుమ్రా 8, ఉస్మాన్‌ ఖవాజా (బి) సిరాజ్‌ 21, మార్నస్‌ లబుషేన్‌ (ఎల్బీ) సిరాజ్‌ 70, స్టీవ్‌ స్మిత్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 13, ట్రావిశ్‌ హెడ (సి) నితీశ్‌ (బి) బుమ్రా 1, అలెక్స్‌ కేరీ (బి) బుమ్రా 2, పాట్‌ కమిన్‌ (సి) రోహిత్‌ (బి) జడేజా 41, నాథన్‌ లయాన్‌ నాటౌట్‌ 41, స్కాట్‌ బొలాండ్‌ నాటౌట్‌ 10, ఎక్స్‌ట్రాలు : 16, మొత్తం : (82 ఓవర్లలో 9 వికెట్లకు) 228.
వికెట్ల పతనం : 1-20, 2-43, 3-80, 4-85, 5-85, 6-91, 7-148, 8-156, 9-173.
బౌలింగ్‌ : జశ్‌ప్రీత్‌ బుమ్రా 24-7-56-4, ఆకాశ్‌ దీప్‌ 17-4-53-0, మహ్మద్‌ సిరాజ్‌ 22-4-66-3, రవీంద్ర జడేజా 14-2-33-1, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 1-0-4-0, వాషింగ్టన్‌ సుందర్‌ 4-0-7-0.
బుమ్రా @ 200
డెన్నిస్‌ లిల్లీ, వకార్‌ యూనిస్‌, డేల్‌ స్టెయిన్‌, ఇయాన్‌ బోథమ్‌, జోయెల్‌ గార్నర్‌, అలెన్‌ డొనాల్డ్‌ వంటి దిగ్గజ పేసర్లు బుమ్రా (44) కంటే తక్కువ మ్యాచుల్లో 200 వికెట్ల మార్క్‌ అందుకున్నారు. కానీ సగటులో బుమ్రా.. దిగ్గజాలను వెనక్కి నెట్టాడు. 200 టెస్టు వికెట్ల కోసం కేవలం 3912 పరుగులే ఇచ్చాడు. సగటు 19.56 మాత్రమే. జోయెల్‌ గార్నర్‌ (4067), షాన్‌ పొలాక్‌ (4077)లు వరుసగా 20,34, 20.39 సగటుతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక స్ట్రయిక్‌రేట్‌లోనూ బుమ్రా ప్రతి 42.4 బంతులకు ఓ వికెట్‌ ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రా 200 వికెట్ల వేటలో 8484 బంతులు సంధించగా.. వకార్‌ యూనిస్‌ (7725), డెల్‌ స్టెయిన్‌ (7848), కగిసో రబాడ (8154)లు పేస్‌ దళపతి కంటే ముందున్నారు. ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ గడ్డపై బుమ్రా రికార్డు అమోఘం. బుమ్రా కెరీర్‌లో 202 వికెట్లు పడగొట్టగా.. అందులో 70.3 శాతం వికెట్లు (142) ఈ దేశాల్లోనే సాధించినవే. స్వదేశంలో 12 మ్యాచుల్లో 17.20 సగటు, 35.5 స్ట్రయిక్‌రేట్‌తో 47 వికెట్లు పడగొట్టగా.. విదేశీ గడ్డపై 32 టెస్టుల్లో 20.29 సగటు, 44.5 స్ట్రయిక్‌రేట్‌తో 153 వికెట్లు తీసుకున్నాడు. ఇక భారత్‌ సాధించిన 20 టెస్టు విజయాల్లో బుమ్రా 14.4 సగటుతో ఏకంగా 110 వికెట్లు పడగొట్టాడు.