అనుమతించకున్నా ధర్నా చేస్తాం

అనుమతించకున్నా ధర్నా చేస్తాం– ధైర్యముంటే పర్మిషన్‌ ఇవ్వాలి
– జీవో 3తో మహిళలకు అన్యాయం
– న్యాయపోరాటం చేసి తీరుతాం
– రేవంత్‌ సర్కారువి మహిళా వ్యతిరేక నిర్ణయాలు : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున హైదరాబాద్‌ ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద భారత జాగృతి ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నాను నిర్వహించి తీరుతామని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 3తో నియామకాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ధర్నాకు అనుమతించాలని మూడు రోజుల క్రితమే పోలీసులను కోరినట్టు ఆమె తెలిపారు. పోలీసుల నుంచి దానిపై ఎలాంటి అభిప్రాయం రాలేదనీ, రాకపోయినా ధర్నా చేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. రేవంత్‌ రెడ్డి సర్కారుకు ధైర్యముంటే ధర్నాకు అనుమతించాలని ఆమె సవాల్‌ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కవిత విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన జీవో 3తో మహిళలకు నియామకాల్లో తరతరాల పాటు నష్టం జరిగే ప్రమాదముందని హెచ్చరించారు. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించాలని భావించామని చెప్పారు. ప్రజాపాలనలో ఎవరైనా, ఎక్కడైనా ధర్నాలు చేసుకోవచ్చంటూ కాంగ్రెస్‌ ఇచ్చిన మాట తప్పిందని విమర్శించారు.
రాష్ట్రంలో కరవు పరిస్థితులపై ఆమె మాట్లాడుతూ ”ఇది కరువు కాదు. కాళేశ్వరం ప్రాజెక్టును, కేసీఆర్‌ను బద్నాం చేయాలన్న ఉద్ధేశంతో ముఖ్యమంత్రి సృష్టించిన కృత్రిమ కరువు ” అని వ్యాఖ్యానించారు. అవగాహనరాహిత్యంతో ప్రభుత్వం చెరువులను నింపలేకపోయిందనీ, దాంతో ఆ నెపాన్ని ప్రకృతి వైపరిత్యంగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి అనుభవరాహిత్యం కారణంగా రైతులు, ప్రజలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రతి పక్షాలను పదే పదే బెదిరించడం అప్రజాస్వామికమని స్పష్టం చేశారు. నిజానికి రాష్ట్రంలో పోలీసులు స్వేచ్చ తో పనిచేస్తే ముఖ్యమంత్రిపై వందల కేసులు పెట్టాల్సి ఉండేవారని వ్యాఖ్యానించారు. అంతు చూస్తామని…మానవ బాంబులవుతారని ముఖ్య మంత్రి మాట్లాడడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
బీజేపీ ఎంపీ అర్వింద్‌ ఎక్కడ నుంచి పోటీ చేసినా ఓడిస్తానని కవిత ఈ సందర్భంగా శపథం చేశారు.ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్లలో అర్వింద్‌ను ఓడించానని తెలిపారు.రానున్న పార్ల మెంటు ఎన్నికల్లోనూ ఓడిస్తాననీ, అదే తన ఎజెండా అని స్పష్టం చేశారు. అయితే, తాను పోటీ చేసే విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు. అలాగే, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీలను బొందపెట్టేందుకు చూస్తున్నారని, అది ఆ పార్టీలతో సాధ్యం కాదన్నారు.