కోచ్‌ మారినా..ఓటమే!

– తొలి రౌండ్లోనే సింధు పరాజయం
– ప్రణయ్, ప్రియాన్షు ముందంజ
– కొరియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌
యోషు (కొరియా) : ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పదేండ్ల కనిష్టానికి చేరుకున్న భారత బ్యాడ్మింటన్‌ అగ్రశ్రేణి షట్లర్‌ పి.వి సింధు.. కోచ్‌ను మార్చినా ఆట మెరుగుపడలేదు!. కొరియా ఓపెన్‌ తొలి రౌండ్లోనే పరాజయం పాలైన సింధు..చైనీస్‌ తైపీ షట్లర్‌ చేతిలో 1-2తో ఓటమి చెందింది. మహిళల సింగిల్స్‌లో పై యు పో (చైనీస్‌ తైపీ) చేతిలో 18-21, 21-10, 13-21తో మూడు గేముల మ్యాచ్‌లో నిరాశపరిచింది. వ్యక్తిగత కోచ్‌ హఫీజ్‌ శిక్షణ సారథ్యంలో పోటీపడిన తొలి టోర్నీలోనే సింధు పేలవ ప్రదర్శన చేసింది. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్‌ 12-21, 17-21తో, తాన్య హేమంత్‌ 11-21, 17-21తో, అష్మిత చాలిహ 13-21, 12-21తో, మాళవిక బాన్సోద్‌ 17-21, 7-21తో, తన్సిం మిర్‌ 11-21, 18-21తో వరుస గేముల్లో పరాయం పాలయ్యారు. మహిళల సింగిల్స్‌లో తొలి రౌండ్లోనే భారత షట్లర్లు కంగుతినగా.. ఈ విభాగంలో పతక ఆశలు ఆవిరయ్యాయి.
పురుషుల సింగిల్స్‌లో హెచ్‌.ఎస్‌ ప్రణయ్, ప్రియాన్షు రజావత్‌ ముందంజ వేశారు. బెల్జియం షట్లర్‌ జులియన్‌పై 21-13, 21-17తో ప్రణయ్ వరుస గేముల్లో అలవోక విజయం సాధించాడు. కొరియా షట్లర్‌ చో జి హూన్‌పై 21-15, 21-19తో ప్రియాన్షు రజావత్‌ మెరిశాడు. మాజీ వరల్డ్‌ నం.1 కిదాంబి శ్రీకాంత్‌ మూడు గేముల పోరులో జపాన్‌ స్టార్‌ కెంటో మెమోట చేతిలో ఓడాడు. 21-12, 22-24, 17-21తో హోరాహొరీ పోరులో శ్రీకాంత్‌ పోరాడి ఓడాడు. కిరణ్‌ జార్జ్‌ 17-21, 9-21తో, మిథున్‌ మంజునాథ్‌ 11-21, 4-21తో పరాజయం పాలయ్యారు. మెన్స్‌ డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ 21-16, 21-14తో తొలి రౌండ్లో అలవోక విజయం సాధించింది. బల్గేరియా జోడీ వాకోవర్‌తో గాయత్రి, ట్రెసా జంట మహిళల డబుల్స్‌లో ముందంజ వేసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్‌ కపూర్‌, సిక్కి రెడ్డి 21-17, 21-17తో ఫిలిప్పిన్స్‌ జోడీపై వరుస గేముల్లో గెలుపొంది ప్రీ క్వార్టర్స్‌లో కాలుమోపారు.