నవతెలంగాణ – కామారెడ్డి
ప్రభుత్వాలు మారిన విద్యార్థుల బాధలు మారావా అని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు అన్నారు. జిల్లా కేంద్రంలో జరిగిన విద్యార్థి సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను గత ప్రభుత్వం సరిగా విడుదల చేయకపోవడం వల్ల బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. అదే పంథాను ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రయివేటు డిగ్రీ, పీజీ కళాశాలలు బంద్ చేస్తున్న క్రమంలో ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వేరే పథకాలకు, కాంట్రాక్టర్లకు వేళ కోట్ల బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల మెస్ బిల్లులు, స్కాలరుషిప్, బోధనా రుసుములు చెల్లించడానికి మాత్రం బడ్జెట్ లేదా అని ప్రశ్నించారు. గత 3 సంవత్సరాల నుండి ఫీజు బకాయిలు రాక ప్రయివేట్ కళాశాలల్లో చదివే విద్యార్థులు ధ్రువపత్రాలు తీసుకునే సమయంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు బకాయిలను విడుదల చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడ తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.దయాకర్,రవికుమార్,శ్రావణ్,మోహన్ చారి,రాము తదితరులు పాల్గొన్నారు.