– టీఏజీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తొడసం భీంరావు
నవతెలంగాణ-మంచిర్యాల
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల చట్టాలను, హక్కులను కాలరాస్తున్నాయని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తొడసం భీంరావు అన్నారు. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని చార్వాక ట్రస్ట్ హాల్‌లో గురువారం ఆదివాసుల గోడు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. దీనికి భీంరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆదివాసుల బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2022లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చి ఆదివాసులకు అడవి మీద హక్కులు లేకుండా చేసిందన్నారు. అడవి సంరక్షకులైన ఆదివాసులను అడవుల నుండి వెళ్లగొట్టి అడవులన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ చట్టం అమలుతో ఆదివాసుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. 40శాతం ఉన్న ఆదివాసీ గ్రామాలను ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించి వారి అభివృద్ధికి నిధులు కేటాయించాలని చట్టం ఉన్నప్పటికీ ఈ జిల్లాలో అలాంటి గ్రామాలను గుర్తించకపోవడం శోచనీయమన్నారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న వారిపై అటవీ శాఖ అధికారులు జులుం ప్రదర్శిస్తూ వేసిన పంటలను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ చట్టాల అమలు, సమస్యల పరిష్కారం కోసం అధికారులు, ప్రభుత్వాలు పనిచేయాలని, లేనియెడల భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాల రాజన్న, ఎర్మ పున్నం, సామాజిక న్యాయవేదిక నాయకులు రంగు రాజేశం, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు ఉండ్రాల ఎల్లయ్య, టీఏజీఎస్ నాయకులు ఆత్రం శ్రావణ్, సిడాం సమ్మక్క, మర్మల మల్లేశ్వరి, బూదక్క, తలండి ముత్తయ్య, మాధవి, భీమేష్, పద్మ, ఆత్రం రాజు వివిధ గ్రామాల ఆదివాసులు పాల్గొన్నారు.