ధర తగ్గినా.. బాదుడే ..?

– 15 నెలల్లో క్రూడాయిల్‌ ధర 31 శాతం చౌక
– రూ. 31 వేల కోట్ల లాభంలో చమురు కంపెనీలు
– మోడీ ప్రభుత్వం పెట్రోల్‌..డీజిల్‌ ధరల్ని ఎందుకు తగ్గించటంలేదు..?
ఓవైపు ఉచితాలు అక్కర్లేదని సుప్రీంకోర్టు ముందు అఫిడవిట్‌ దాఖలు చేసింది. మరోవైపు మోడీ సర్కార్‌ ఎన్నికలు వస్తే చాలు..ఓటర్లపై ఎక్కడలేని మమకారం పుట్టుకొస్తోంది.అమాంతంగా రూ. వెయ్యికిపైనే పెంచేసిన బీజేపీ ప్రభుత్వం..ఇపుడు గృహావసరాల వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.200 తగ్గించేసింది. ఇన్నాళ్లు కార్పొరేట్లకు నజరానాలిచ్చుకుంటూ..ఇపుడు ఓటర్లకు గ్యాస్‌ ధరను రూ.200 తగ్గించేసి..చిల్లర పడేసినట్టు ప్రచారార్భాటం చేస్తోంది. అయితే సామాన్యుల రెండో అతిపెద్ద అవసరమైన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎందుకని తగ్గించటంలేదు. గత 15 నెలలుగా చమురు ధరలు అలాగే ఉన్నాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు చివరిసారిగా 21 మే 2022న పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని రూ. 8, డీజిల్‌పై లీటరుకు రూ. 6 తగ్గించాయి .అది కూడా ఎన్నికలు వచ్చిన ఆ రాష్ట్రాల్లో గట్టెక్కటానికి బీజేపీ ఓటర్లపై వల విసిరింది. అయితే ఆ ప్రయత్నం కొన్నిచోట్ల బెడిసికొట్టింది. ఇపుడు మరోసారి ఆ ఐదు రాష్ట్రాల్లో గెలవటానికి గ్యాస్‌ ధర తగ్గించింది.

న్యూఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.9.5, రూ.7 తగ్గాయి. అప్పుడు ముడి చమురు ధర (డాలర్‌)రూ. 109.51. దీని తరువాత, జూన్‌ 2023లో, ఇది 31.5 శాతం తగ్గి (డాలర్‌) రూ.75 కంటే తక్కువకు పడిపోయింది. ఇలా ఓవైపు పన్నులు,మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు తగ్గినా..మోడీ ప్రభుత్వం వినియోగదారులకు ఉపశమనం కలిగించటంలేదు. వచ్చిన డబ్బును ఖజానాలో నింపుకుంటోంది.ఇలాంటి పరిస్థితుల్లో రాఖీ పండుగ కానుకగా గ్యాస్‌ ధర తగ్గించామంటోంది. వాస్తవానికి మహిళలకు సంబంధించిన సంక్షేమపథకాలు, బేటీ బచావో..బేటీ పడావో, నిర్భయ నిధులు ఇలా మరెన్నో వాటికి కేటాయించిన నిధుల్ని మోడీ ప్రచారానికి వినియోగించుకుంటోందని కాగ్‌ నివేదిక ధ్రువీకరించింది. ఈ విషయాన్ని కేంద్రం కూడా పార్లమెంట్‌ సాక్షిగా అంగీకరించింది. మహిళలంటే అంత ప్రేమ ఒలకబోస్తున్న బీజేపీ ప్రభుత్వం మెజార్టీ ఉన్నా..మహిళా రిజర్వేషన్లను ఎందుకని అమలు చేయటంలేదని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
పెట్రోల్‌-డీజిల్‌పై రూ.5 నుంచి రూ.6 వరకు తగ్గించవచ్చు
2022లో ఖరీదైన ముడి చమురును కొనుగోలు చేయడం ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ తయారీలో భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని కంపెనీలు వాదిస్తున్నాయి. అది ఇప్పుడు తిరిగి చెల్లిస్తోంది. 2022-23 ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో, మూడు ప్రభుత్వ చమురు కంపెనీలు కూడా 16,700 కోట్ల నష్టాన్ని చవిచూశాయని చెబుతున్నాయి.
అయితే ఇప్పుడు చిత్రం మారిపోయింది. ఈ చమురు కంపెనీలు 2023-24 ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో రూ.31,159 కోట్లు మేర లాభాన్ని ఆర్జించాయి. పెట్రోలు-డీజిల్‌పై రూ.5 నుంచి 6 వరకు చమురు కంపెనీలు తగ్గించే అవకాశాలు లీకులు ఇస్తున్నాయి. వాస్తవానికి, చమురు కంపెనీలు గత ఏడాది నుంచే ముడి చమురు కొనుగోలులో భారీ లాభాలను ఆర్జించాయి. 2022 మొదటి త్రైమాసికంలో, ముడి చమురు ప్రపంచంలో బ్యారెల్‌కు (డాలర్‌ రూపంలో) రూ. 131 ఉంటే.. రష్యా నుంచి రూ. 99కి సరఫరా అయింది..దీనికి తోడు 2023 మొదటి త్రైమాసికంలో, అంటే ఏప్రిల్‌-జూన్‌ మధ్య, సౌదీ అరేబియా , యూఏఈ నుంచి చమురును బ్యారెల్‌ రూ.86 ధరకు విక్రయిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇది 77.7 డాలర్లుగా ఉంది. రష్యా నుంచి చమురును 70 డాలర్ల కంటే తక్కువకు పొందాం. అంటే చమురు కంపెనీలు ఇప్పటికీ ఈ చమురును బ్యారెల్‌కు 8.8 శాతం డాలర్ల తగ్గింపును పొందుతున్నాయి. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి డాక్టర్‌ హర్దీప్‌ సింగ్‌ పూరీ స్వయంగా చమురు కంపెనీలను ధరలు తగ్గించాలని కోరారు.
ఓటు రాజకీయం..?
చమురుధరలు పెంచేటపుడు మా చేతుల్లో ఏం లేదు. అంతా చమురు కంపెనీలదే అంటోంది మోడీ ప్రభుత్వం. ఎన్నికలపుడు మాత్రం మేమే గ్యాస్‌ ధర తగ్గించామని మోడీ టీవీ స్క్రీన్లపై ప్రత్యక్షమవుతారు. వాస్తవానికి పెంచిన గ్యాస్‌ ధరలు కానీ, ఇంధన ధరలవల్ల సామాన్యజనం ఎంతగా ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతుందన్న విషయాన్ని మాత్రం లైట్‌ తీసుకుంటోంది. అధికారంలో వచ్చేంతవరకు అన్నీ ఇస్తాం..గద్దె నెక్కాక మీరు తీసుకున్న సంక్షేమ ఫలాలను కక్కిస్తామనేలా బీజేపీ తీరు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఓటరులో మార్పు రానంతవరకూ పాలకులను నమ్మి మోసపోవటం సర్వసాధారణమైపోతోంది.