బలం లేకున్నా మెజార్టీ సీట్లు గెలుస్తాం

బలం లేకున్నా మెజార్టీ సీట్లు గెలుస్తాం– హంగ్‌ వస్తే ఏర్పడేది బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వమే
– కేసీఆర్‌కు ఓటమి భయం.. మేకపోతు గాంభీర్యం పైకే : మీట్‌ ది ప్రెస్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో 119కి గానూ అన్ని నియోజకవర్గాల్లో బలం లేకపోయినప్పటికీ తమ పార్టీనే అధిక స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని బీజేపీ ఎమ్మెల్యే, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మెన్‌ ఈటల రాజేందర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వీక్‌గా ఉన్నా ఉత్తర తెలంగాణలో తమకే అధిక సీట్లు వస్తాయని నొక్కి చెప్పారు. ఒకవేళ తెలంగాణలో హంగ్‌ వస్తే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పారు. ఎంఐఎం, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్న చరిత్ర బీజేపీకి ఎన్నడూ లేదన్నారు. ఆ మూడు పార్టీలే పరస్పరం ఎన్నికల్లో సహకరించుకుంటాయని చెప్పారు. సోమవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ ప్రధాన కార్యదర్శి విరావత్‌ అలీ అధ్యక్షతన నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో ఈటల మాట్లాడారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మాదిరిగా సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారనీ, అభివృద్ధి పేరుతో హైదరాబాద్‌ చుట్టు పక్కల ఉన్న 5,800 ఎకరాల భూమిని అతి చౌక ధరలకు అమ్మేసిందని ఆరోపించారు. ఒక్క గజ్వేల్‌లోనే ఆయన బాధితులు 30 వేల మంది ఉన్నారనీ, ఆ బాధితుల సంఘానికి తననే అధ్యక్షులుగా ఉండాలని కోరారని చెప్పారు. వారంతా కలిసికట్టుగా కేసీఆర్‌ను ఓడించబోతున్నారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామనీ, ఆ మూడింటిలోనూ కేసీఆర్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గత ప్రభుత్వాలు అవకాశమున్నా గ్యారెంటీ, ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ రుణాలు ఎక్కువగా తీసుకురాలేదన్నారు. రూ.74వేల కోట్ల రుణంతో మొదలైన తెలంగాణ..5.5 లక్షల కోట్లకు అప్పు చేరుకున్నదన్నారు. ఒక్కో తలపై 1.25 లక్షల అప్పు ఉందని చెప్పారు. ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ శాతం 25 శాతం దాటిపోయిందని విమర్శించారు. జీడీపీలో 25 శాతం కంటే ఎక్కువ అప్పు దాటిపోయిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ పూటకాపూట అన్నట్టుగా ఉందనీ, భవిష్యత్తులో అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేదన్నారు. ధనిక రాష్ట్రమే అయితే సర్పంచులు, ఏంపీటీసీలకు చిన్న చిన్న బిల్లులు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నదని ప్రశ్నించారు. ఉద్యోగ నియామకాల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనీ, 17 పేపర్లు లీకు కావడం దారుణమని విమర్శించారు. ఏటా 360 టీఎంసీలు ఎత్తివేయాలనే లక్ష్యంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు దాన్ని చేరుకోలేదనీ, నాలుగేండ్లలో ఎత్తిపోసింది 72 టీఎంసీలేనని విమర్శించారు. దానికి రూ.9 వేల కోట్ల దాకా కరెంటు బిల్లులు కట్టారని చెప్పారు. లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేందుకు మిగతా ప్రభుత్వ కార్యక్రమాలను ఆపారని విమర్శించారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాల పంపిణీ, దళిత బంధు హామీల్లో ఒక్కదాన్నీ నెరవేర్చలేదన్నారు.