మండుటెండలో సైతం క్రీడాకారుల క్రీడాసక్తి

– రెండో రోజు కొనసాగిన సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడలు
నవతెలంగాణ – సిద్దిపేట
మండే ఎండల్లో సైతం క్రీడాకారులు క్రీడల్లో పాల్గొంటూ తమ క్రీడా ఆసక్తిని చూపుతున్నారు. పట్టణంలోనే ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో సీఎం కప్పు 2023 క్రీడలు రెండో రోజు మంగళవారం కొనసాగాయి. కబడ్డీ,  త్రో బాల్ , కోకో , వాలీబాల్, షటిల్ పోటీలు రసవత్తరంగా కొనసాగాయి. జిల్లాలో మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసి పంపించనున్నారు. జిల్లాలోని వివిధ మండలాల నుండి అనేక మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా స్థాయి సిఎం- కప్ పోటీలకు తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అబ్జర్వర్ గా సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కుంటనోళ్ళ శివ కుమార్ తో పాటు మరికొంతమంది పిడీలు , పీఈటీలు క్రీడాకారుల నైపుణ్యాన్ని పరిశీలించారు. వచ్చిన క్రీడాకారులందరికి భోజనాలు, మంచినీటి సౌకర్యాన్ని జిల్లా క్రీడా శాఖ అధికారులు కల్పించారు. బుధవారం క్రీడల ముగింపు సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు హాజరుకానున్నట్లు సమాచారం. డి వై ఎస్ ఓ నాగేందర్ మాట్లాడుతూ మంత్రి హరీశ్ రావు సహకారంతో అన్ని రకాల క్రీడల కోర్టులను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని  తెలిపారు. జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులు జిల్లాలో ఉన్నారని అన్నారు. వచ్చిన క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ఈ పోటీలలో వివిధ క్రీడా సంఘాల అసోసియేషన్ అధ్యక్ష,  కార్యదర్శులు, పిడి, పిఈ టి లు, ఎస్ జి ఎఫ్ కార్యదర్శి రామేశ్వర్ రెడ్డి, శివకుమార్,  ప్రవీణ్ కుమార్, కనకయ్య, అశోక్, లక్ష్మణరావు, సజీవ్, రఫత్ ఉమార్, బిక్షపతి , అశోక్ తదితరులు పాల్గొన్నారు.