కృష్ణుడు కూడా భ్రష్టుడై ఉండేవాడు

Even Krishna was corrupt– సుప్రీంకోర్టు ఎలక్టోరల్‌ బాండ్ల తీర్పుపై మోడీ అక్కసు
న్యూఢిల్లీ: ఎలక్టోరల్‌ బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం తన అక్కసునంతా వెళ్లగక్కారు. ఎలక్టోరల్‌ బాండ్లను రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా మోడీ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఈరోజు కుచేలుడి ఆరోపణలు స్వీకరించి ఉంటే కృష్ణుడిని కూడా అవినీతిపరుడే’ అని చెప్పేవారేమో అని మోడీ సుప్రీంకోర్టుపై పరోక్షంగా దాడి చేశారు. ఈ వీడియోతో ఎవరైనా ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేస్తే, అది అవినీతిగా కోర్టు తీర్పు ఇస్తుందని ప్రధాని అన్నారు. కల్కిధామ్‌ ఆలయానికి శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ కోర్టు తీర్పును అపహాస్యం చేశారు. రాజకీయ పార్టీలకు విరాళాలు సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్‌ బాండ్‌ పథకాన్ని రద్దు చేస్తూ గత వారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని, అనామక విరాళాల పద్ధతి పార్టీలకు ఎవరు డబ్బు ఇస్తున్నారో తెలుసుకునే పౌరుల హక్కును ఉల్లంఘిస్తుందని పేర్కొంది.
2016లో నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ ద్వారా ఎలక్టోరల్‌ బాండ్లను ప్రవేశపెట్టింది. 2017లో ఆర్థిక చట్టం, ప్రజాప్రాతినిధ్య చట్టం, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం, రిజర్వు బ్యాంకు చట్టం, ఆదాయపు పన్ను చట్టాలను హడావుడిగా సవరించి ఇందుకు రంగం సిద్ధం చేశారు.రూ.1000, రూ.10,000, రూ.10 లక్షలు, కోటి రూపాయల బాండ్లను జారీ చేస్తారు. వీటిని స్వీకరించే రాజకీయ పార్టీలు 15 రోజుల్లోగా బాండ్లను బ్యాంకుకు సమర్పించి, నగదుగా మార్చుకోవాలని చెప్పింది. ఎలక్టోరల్‌ బాండ్ల స్కీమ్‌ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ సీపీఐ(ఎం), అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, సుప్రీం కోర్టు పైన పేర్కొన్న విధంగా చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది.