ఆమె బాధ్యతాయుతమైన సేవకై సివిల్స్‌ని లక్ష్యంగా పెట్టుకొంది. ప్రయత్నించిన ప్రతిసారీ ఆఖరి అంచుదాకా వెళ్ళి నిరాశతో వెనుదిరిగేది. ఆఖరికి తనకున్న ‘ఆఖరి’ అవకాశంతో (ఆరోసారి) ‘అన్నిసార్లు కానిది ఈ ఒక్కదానితో ఏమవుతుంది’ అన్న సంశయం లేకుండా సన్నద్దమయ్యింది. ఫలితంగా ఆలిండియా 50 వ ర్యాంక్ సాధించి IFS సర్వీస్‌కు ఎంపికైన ‘పెద్దిరెడ్డి వాసంతి’ గారితో ఈవారం జోష్ ముచ్చట్లు…
సివిల్స్ ప్రయత్నాలు తక్కువగా జరిగే ప్రాంతం (రాయలసీమ) నుండి వచ్చారు. మొదటగా మీలో సివిల్స్ రాయాలన్న ఆలోచన ఎప్పుడు, ఎలా కలిగింది?
డిఫార్మసీ చదువుతున్నప్పుడు ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఆర్.డి.టి. హాస్పిటల్‌లో (బత్తలపల్లి: అనంతపురం) పనిచేస్తున్నపుడు చికిత్స కోసం వచ్చే వివిధ నేపథ్యాలున్న ప్రజలను గమనిస్తూ ఉండేదాన్ని. ఆ హాస్పిటల్ వారి సేవాదక్పథంలో నేను కూడా భాగమయ్యాను. దానికి ప్రజలు చూపే కతజ్ఞతపూర్వపు భావన ద్వారా నాకు ఏదో తెలియని ఫీలింగ్ కలిగేది. ఒక ఆరోగ్య విషయంలోనే ఇలా ఉంటే సామాజిక అంశాలతో ముడిపడి ఉన్న రంగాలలో సేవ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మొదలయ్యింది. ప్రజలతో మమేకమై సేవ చేసే అవకాశం కోసం వెతికినప్పుడు ‘సివిల్స్’కున్న ప్రాధాన్యత తెలిసింది. అందులో ఎంపిక అయితే ఎలా ఉంటుంది? ఏమేమి చెయ్యొచ్చు? వంటి అంశాలను క్షుణ్ణంగా తెలుసుకొని సివిల్స్ సాధనే లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగాను.
కుటుంబ నేపథ్యం?
ఒకప్పటి ఉమ్మడి అనంతపురం ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లాలోని గౌనివారిపల్లి (గోరంట్ల:మండలం) మా ఊరు. నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు (పెద్దిరెడ్డి గోవిందరెడ్డి), అమ్మ సాధారణ గహిణి (ఉషారాణి). తమ్ముడు హరికిరణ్ ఎమ్మెస్ సర్జన్ చేస్తున్నాడు. మొత్తంగా గ్రామీణ నేపథ్యమున్న కుటుంబం.
ప్రిపరేషన్ ప్రణాళిక ఎలా ఉండేది?
నా ప్రిపరేషన్‌లో ఎక్కువ భాగం యం.బి.ఎ చదువుతున్నప్పుడే (హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ) జరిగింది. అక్కడి విద్యార్థులు అకాడమిక్‌తో పాటు పోటీ పరీక్షలకు కూడా ప్రిపేరయ్యేవారు. ఆ వాతావరణం నాకు చక్కగా ఉపయోగపడింది. మొదట్లో ఒక స్పష్టత, ప్రణాళిక లేకుండా చదివేదాన్ని. తర్వాత అంశాల వారిగా చదవడం ప్రారంభించాను. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, విపత్తుల నిర్వహణ వంటి వాటిపై అవగాహనతోపాటు తొందరగానే ఆ అంశాలపై పట్టు వచ్చింది. వార్తాపత్రికలు, ఛానల్స్‌లో సివిల్స్ సాధించిన వారి అనుభవాలు… ఇలా అన్ని ఆ ప్రణాళికలో భాగమే. ఇవే నన్ను గమ్యానికి దగ్గర చేశాయి.
సన్నద్ధ సమయంలో ఒక్కోసారి ఆత్మవిశ్వాసం కోల్పోయే సందర్భాలు ఉంటాయి. వాటిని ఎలా అధిగమించారు?
అనుకున్న ఫలితాలు రానప్పుడు మానసిక సంఘర్షణ తప్పకుండా ఉంటుంది. మొదట్లో ఏపిపిఎస్సీ రాసినప్పుడు పరీక్షలో నెగ్గి ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన రెండుసార్లూ సర్వీస్ రాలేదు. ఆ సమయంలో కొంత ఒత్తిడికి లోనయ్యాను. ఎక్కడ తప్పు చేస్తున్నాను? ఏది తక్కువ ప్రిపరేషన్ చేస్తున్నాను?… వంటి అంశాలపై స్వసమీక్ష చేసుకున్నప్పుడు వెనుకబడడానికి కారణాలు తెలిశాయి. వాటిని రిపీట్ కాకుండా చూసుకుంటూ మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాను. అనుకున్న విజయం సాధించగలిగాను. గమ్యం చేరాలంటే మానసిక నిబద్ధత చాలా అవసరం. అది బలంగా ఉంటే ఏ విధమైన ఒత్తిళ్ళు, ఓటములు మనల్ని నియంత్రించలేవు.
IFS ఉద్యోగ సరళి ఎలా ఉంటుంది?
పర్యావరణం అన్నది వెలకట్టలేని సహజ సంపద. వాటితో అన్ని జీవజాతుల మనుగడ ముడిపడి ఉంటుంది. అందులో మనిషి కూడా ఉన్నాడు. ఈ IFS లో ప్రధానంగా పర్యావరణ అభివద్ధి, సమతుల్యత, అటవీ సంరక్షణ, జంతురక్షణ, చట్టాలు వాటి అమలు, జాతీయ-అంతర్జాతీయ అడవుల పరిరక్షణ… వంటి అంశాలతో ముడిపడి ఉంటుంది. వ్యక్తిగతంగా చెప్పుకోవాలంటే GO BACK TO NATURE, NATURE IS FIRST TEACHER అన్నట్టు ఆస్వాదించడానికి అనువైనదిగా ఉంటుంది.
‘పెద్దిరెడ్డి వాసంతి IFS వెనుక ఎవరెవరి తోడ్పాటు ఎంతమేరకు ఉంది?
ప్రతి వ్యక్తి ఎదుగుదలలో కుటుంబానిది ప్రముఖపాత్ర. ఈ విషయంలో నా కుటుంబం ఎల్లప్పుడూ నా వెన్నంటే ఉంటూ ప్రోత్సాహించింది. అపజయం పలకరించినప్పుడు కుటుంబం భరోసాగా నిలబడింది. సందేహాలు తీర్చడంలో గురువుల అండ దొరికింది. సానుకూల దక్పథాన్ని కలిగించే మిత్ర బృందం, గెలుపుని ఆశించే శ్రేయోభిలాషులు… ఇలా చాలామందికే నా గెలుపులో వాటా ఉంది. అన్ని రకాలుగా వారి అండ ఉండడంవల్లనే నేను విజయం సాధించానని అనుకొంటా. ‘మానవుడు సంఘజీవి (అరిస్టాటిల్)’ అనడంలో అసలు అర్థం ఇదేనేమో అనిపిస్తుంది.
అందరూ ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా పెట్టుకుని ప్రచ్ఛన్న నిరుద్యోగానికి యువతే కారణమవుతున్నారన్న వాదనకు మీ స్పందన?
ప్రస్తుతమున్న యువత ఒక్క ప్రభుత్వ ఉద్యోగంపట్ల మాత్రమే ఆసక్తి చూపడం లేదు. ప్రతి ఒక్కరూ వివిధ రంగాలలో రాణించడానికి సుముఖత చూపిస్తున్నారు. అదేవిధంగా కొత్తగా వస్తున్న తరం నవకల్పనలు, కొత్త ఆవిష్కరణలు చెయ్యడానికి ముందుంటున్నారు. సమాజంలో చాలా మార్పులు వస్తూ వుంటాయి. కొన్నిచోట్ల అవకాశాలు పోతే మరికొన్నిచోట్ల కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. ఉద్యోగకల్పన విషయంలోనూ అదే జరుగుతుంది. ఉదాహరణకు ఇంటర్నెట్ రంగం ద్వారా కొన్ని ఉద్యోగాలు పోతే టెలికాం రంగంలో అధికంగా ఉద్యోగాలు ఏర్పడ్డాయి. నిరుద్యోగానికి కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వడమే ప్రధాన కారణం కాదు. ప్రభుత్వ ఉద్యోగం కూడా మిగతా వత్తులలాగే ఒక వత్తి అని నా గట్టి అభిప్రాయం. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది.
సేవకంటే సంపాదన అభిలాష ఎక్కువగా కలిగివున్న తరమిది. మీరు సేవవైపు వచ్చి సంపాదనలో వెనుకబడతారన్న ఆలోచనను ఎలా ఆహ్వానిస్తారు?
ఒక్కొక్కరు ఒక్కో రంగాన్ని, ఒక్కో వత్తిని ఎన్నుకుంటారు. నేను ప్రజావ్యవస్థలతో కూడుకొన్న రంగాన్ని ఎన్నుకున్నాను. మరికొంతమంది వాళ్ళ అభిరుచికి తగ్గ రంగాన్ని ఎంచుకుంటారు. ఎకానమీ కాంటెస్ట్‌లో సంపాదన చెయ్యడం కూడా సామాజికసేవలో అంతర్భాగమే. ఒకటైతే వాస్తవం.. సంతప్తికి మించిన సంపద లేదు. నాకు ఈ సర్వీస్ ఆ విధమైన సంపదను అధికంగానే అందిస్తుంది.
సివిల్స్ సాధనకు కోచింగ్ ఎంతమేరకు ఉపయోగపడుతుంది. కోచింగ్ లేకుండా ప్రిపరేషన్ సాధ్యమేనా?
ప్రతి వ్యక్తికి కోచింగ్ అవసరం. అభ్యర్థి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే విషయంలో సలహాలు, సూచనలు, మెళుకువలు చాలా కీలకం. అది ఒక కోచింగ్ సంస్థ ద్వారానైనా అందుకోవచ్చు. అనుభవజ్ఞులైన వారి మార్గదర్శకత్వంలో కావచ్చు. అన్ని సొంతగా తెలుసుకొంటూనైనా కావచ్చు. ఎవరికి వీలైన మార్గాలు వారు ఎంచుకొని విజయాలు సాధిస్తున్నారు. ఫలానా మార్గమే ప్రధానమన్న సిద్ధాంతమేమీ లేదు. కోచింగ్‌కు వెళ్ళకుండా సొంతంగా ప్రిపేరై విజయం సాధించినవారున్నారు. కోచింగ్‌కు వెళ్ళి కూడా సాధించనివారున్నారు. ముఖ్యంగా కావాల్సింది ప్రణాళిక, సన్నద్ధత, సాధనలు మాత్రమే. మిగతావి ఆకారాలుగా సహకరిస్తాయి.
ప్రజా జీవితంలో మీరు నిర్ణయించుకున్న లక్ష్యం?
విధుల్లో బాధ్యతాయుతంగా, పనిపట్ల అంకితభావంతో ముందుకు సాగాలని ఉంది. వాటిలో భాగంగా ఇండియా forest conservation and protectionలో నా వంతు పాత్ర పోషించాలి.
మళ్ళీ సివిల్స్ రాసి IAS, IPS… అన్న అలోచనలు ఉన్నాయా?
లేదు. IFS కోసమే కృషి చేశాను. అది సాధించాను. సో ఐ.ఎఫ్ఫెస్సే నా టార్గెట్.
ఇంటర్వ్యూలో మీరు ఎదుర్కొన్న క్లిష్టమైన ప్రశ్నలు?
ఇంటర్వ్యూలో అభ్యర్థికి విషయాల మీద ఎంతమేరకు అవగాహనుందనే ప్రధానంగా పరీక్షిస్తారు. నన్ను రెండు రకాలుగా ప్రశ్నలు అడిగారు. కటి నేను ఐచ్ఛికంగా ఎంచుకొన్న అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్ సంబంధించినవి. రెండు అప్లికేషన్‌లో పేర్కొన్న నా హాబిట్స్‌కు సంబంధించినవి. ప్రకటనలు మంచి వస్తువులను మాత్రమే ప్రచారం చేస్తాయా? ఒకవేళ మీకు చెడు వస్తువులను ప్రచారం చెయ్యడానికి ఇస్తే చేస్తారా? సమాజంలో వేటికి మీరు అధికంగా స్పందిస్తుంటారు? అన్ని అడిగారు. నాకు తెలిసినవి కాన్ఫిడెంట్‌గా అన్సర్ చేశాను.
సివిల్స్ లక్ష్యంతోపాటు ‘ప్లాన్ బి’గా ఏమి నిర్ణయించుకున్నారు?
ఈ సివిల్స్ ప్రయాణంలో బిలు, సీలు ఏమీ పెట్టుకోలేదు. ఒకవేళ రాకపోయి ఉంటే పబ్లిక్ హెల్త్ రంగంలో ఏదైనా ఎన్జీవోతో కలిసి పనిచేసేదాన్నేమో.
సివిల్స్, IFS ప్రిపేర్ అయ్యేవారికి మీరిచ్చే సలహాలు?
మొదటగా మీ లక్ష్యం నిర్ణయించుకొని దీనికి తగ్గట్టుగా మార్గనిర్దేశం చేసుకొని అపజయాలను లెక్క చెయ్యకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగి విజయం సాధించండి. లక్ష్యసాధనలో కొన్ని త్యాగాలు, విమర్శలు తప్పవు. వాటిని త్యాగం చేస్తూ, వీటిని ఎదుర్కొంటూ విజయం సాధించడమే అన్నింటికీ సమాధానం.
– బి. మదన్ మోహన్ రెడ్డి, 9989894308