న్యూఢిల్లీ : రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు కామ్నా క్రెడిట్స్ అండ్ ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్నోసెంట్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్, రేణుక ఇన్వెస్టెమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశాయి. ఇందులో ఏం విశేషముందని అంటారా? మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని నిబంధనలను ఉల్లంఘించి ప్రమాదంలో పడిన బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థల జాబితాలో ఈ మూడు కంపెనీలూ ఉన్నాయి. ఈ తరహా సంస్థలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ వార్షిక జాబితాలు విడుదల చేస్తూ ఉంటుంది. వాటిలో ఈ కంపెనీలు కూడా ఉండడం గమనార్హం.
ఆయా సంస్థల అనుమానిత ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆర్థిక శాఖకు చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్‌ఐయూ) దర్యాప్తు సంస్థలకు సమాచారాన్ని అందించింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేసేందుకు ఈ యూనిట్ 2018లో మొదటిసారిగా 9,491 ఆర్థిక సంస్థల జాబితాను ప్రచురించింది. అందులో ఈ మూడు కంపెనీల పేర్లు చోటుచేసుకున్నాయి. కొల్‌కతాకు చెందిన కామ్నా క్రెడిట్స్ అండ్ ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2022 జనవరి 4న రూ.5 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. ఆ తర్వాత నాలుగు రోజులకే ఉత్తరప్రదేశ్, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు ఈసీ షెడ్యూలు ప్రకటించింది. ఇన్నోసెంట్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా కొల్‌కతాకు చెందినదే. ఇది 2019 ఏప్రిల్ 12న రూ.25 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. రేణుక ఇన్వెస్టెమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు 2018, 2019, 2022 సంవత్సరాలలో ఆర్థిక శాఖ ప్రచురించిన జాబితాలలో ఉంది. ఇది 2019 ఏప్రిల్ 12న రూ.5 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది.