అది 2013… తన వైకల్యానికి సంబంధించి ధృవీకరణ పత్రం తీసుకునేందుకు క్యూలో నించుంది వీణా అంబరీష్. అప్పటికే మానసికంగా కుంగిపోయి వుంది. అయితే, తనతోపాటు లైన్‌లో ఉన్న వారిని చూసి ప్రేరణ పొందింది. నేనూ బతకాలి.. సాధించాలి.. అని నిర్ణయించుకుంది. బస్సు ప్రమాదం ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ తర్వాత ఆరు నెలలు ఆస్పత్రి పాలవటమేకాదు.. కుడి కాలు పాదం పై భాగం వరకూ తీసేశారు. అప్పుడు ఆమెకు 17 ఏండ్లు. ఎన్ని కష్టాలు ఎదురైనా నవ్వుతూనే సవాళ్లను ఎదుర్కొంటున్న అనేక మందిని ఆమె గమనించింది. ఆ సమయంలో ఒక ధృఢ నిర్ణయం తీసుకుంది. సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదనీ.. మనసుంటే మార్గముంటుందని.. తాను కోరుకున్న జీవితాన్ని కొనసాగించవచ్చుననీ, కన్న కలలను సాధించవచ్చునని నిర్ణయించుకుంది. ఆ విషయాలేంటో ఈ రోజు మానవిలో మీ కోసం…
అందరిలాగే వీణ అంబరీష్‌దీ సంతోషకరమైన, బిజీ జీవితమే. 12వ తరగతి సైన్స్ విద్యార్థిని. భరతనాట్య నృత్యకారిణి. క్లాసికల్ డ్యాన్స్‌లో శిక్షణ పూర్తి చేసింది. రోజూ లాగే ఆ రోజూ ఎంతో ఉత్సాహంగా కాలేజీకి బయలుదేరింది. 2012 జులైలో విషాదం ఆమె జీవితాన్ని బస్సు ప్రమాదం రూపంలో వెంటాడింది. కాలేజీకి వెళ్లే దారిలో రోడ్డు దాటుతుండగా.. బీఎంటీసీ (బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్) బస్సు సిగల్ జంప్ చేసి ఆమెను ఢ కొట్టింది. ‘బస్సు మొదట నన్ను తాకింది. నేను పడిపోయాను, ఆ తర్వాత నా కుడి కాలు మీదుగా టైర్ ఎక్కింది’. చాలా రోజులు ఆస్పత్రిలోనే గడపాల్సి వచ్చింది. ఆమె కుడి కాలు తీవ్రంగా దెబ్బతింది.
మూడు ఆపరేషన్లు
వైద్యులు శతవిధాలా ప్రయత్నించారు. మూడుసార్లు ఆపరేషన్ చేశారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ‘కుడి కాలు సరిచేయటానికి వైద్యులు నా ఎడమ తొడ నుంచి మాంసాన్ని తీసి అతికించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మూడుసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు కొంత చర్మాన్ని అతికించారు. ఇక కాలులేకుండానే జీవిత ప్రయాణం తప్పదని చెప్పారు వైద్యులు. ఆ ప్రదేశం ఇప్పటికీ చాలా సున్నితంగా ఉంటుంది. బయటికి వెళ్లే ముందు ప్రతిరోజూ కట్టు కట్టుకోవాలి. ఆరు నెలలు మంచాన పడ్డాను’ చెప్పింది వీణ. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత వాకింగ్ స్టిక్‌తో నడవటం మొదలు పెట్టింది ఆమె. మొదట్లో… తీవ్రమైన నొప్పితో అడుగేయటం చాలా కష్టంగా ఉండేది. మూడు ఆపరేషన్ల సమయంలోనూ వెన్నుకు అనస్థీషియా ఇచ్చారు. ఫలితంగా వెన్ను సమస్యలూ వెంటాడాయి.
మలుపు తిప్పిన ఘటన
వైకల్యానికి సంబంధించి సర్టిఫికెట్ తీసుకునేందుకు విక్టోరియా ఆస్పత్రికి వెళ్ళింది వీణ. అక్కడకు వచ్చిన వారిది ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. వారిని చూసి స్ఫూర్తి పొందింది. రెండు కాళ్లూలేని ఓ మహిళ పసిపాపతో తమకూరు నుంచి వచ్చింది. ఆ మహిళ తన బిడ్డకు తినిపిస్తూ సంతోషంగా గడపటం చూసి వీణ విస్మయానికి గురైంది. ఆ మహిళ ముందు తన కష్టాలు చాలా చిన్నవిగా కనిపించాయి. ‘ఆమె చాలా సంతోషంగా ఉంది. సాధారణ జీవితాన్ని గడుపుతున్నది. మరి నేనెందుకు చేయలేను’ అనుకుంది. కోరుకున్నవన్నీ చేయగలనన్న నమ్మకం, విశ్వాసం వీణలో పెరిగింది.
చదువుపై దృష్టి
12వ తరగతి పూర్తి చేయాలనుకుంది. 2013 జనవరిలో బోర్డు పరీక్షలకు రెండు నెలల సమయం కూడా లేదు. తన తండ్రి సహాయంతో ట్యూషన్‌కు వెళ్లడం ప్రారంభించింది. పరీక్షల్లో మంచి మార్కులతో పాసైంది. సైన్స్ చదవటం కష్టమని భావించి కామర్స్‌కు మారింది. బెంగళూరు వంటి నగరంలో వైకల్యంతో కాలేజీకి వెళ్లడం కష్టం కాబట్టి, పుదుచ్చేరిలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి (బీబీఏ) డిగ్రీని పూర్తి చేసింది. అక్కడితో ఆగలేదు. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)నూ అభ్యసించింది. బ్యాంక్‌లో సేల్స్ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరింది. అక్కడ సరైన గౌరవం దక్కలేదు. ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. డెస్క్ ఉద్యోగం.. ఒత్తిడి ఎక్కువైంది. ఉదయం తొమ్మిది నుంచి ఆరు వరకు ఆఫీసు పని, ఆ తర్వాత రాత్రి 9:30 గంటలకు మీటింగులు.. ఒక్కోసారి అర్ధరాత్రి అయ్యేది. కాలు మీద ఒత్తిడి కారణంగా ఇన్ఫెక్షన్ ఎక్కువైంది. ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. 2023 ఫిబ్రవరిలో ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకుంది. ఆహారం పట్ల తనకున్న అభిరుచితో సొంతంగా ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంది.
బెంగళూరులో తమిళ రుచి
బెంగుళూరులో అందుబాటులో లేని వాటిపై దృష్టి పెట్టింది. సాంప్రదాయకంగా మటన్ ఖీమాతో తయారుచేసే ‘కరి దోస’ తమిళనాడులోని మధురైలో ఫేమస్ వంటకం. అక్కడ దోసపైన ఆమ్లెట్, మటన్ కర్రీతో వెరైటీగా వేస్తారు. ఆమె 2023లో బెంగుళూరులోని జేపీ నగర్‌లో ఓ దోసె స్టాల్‌ని ప్రారంభించింది. దానికి ‘కరి దోస’ అని పేరు పెట్టింది. దీనికి ముందు వెరైటీ దోసెల రుచులను స్వయంగా చేస్తూ.. దాదాపు రెండు నెలలు పలు ప్రయోగాలు చేసింది. ఆమె ఉదయం 4:30 గంటలకు తన రోజును ప్రారంభిస్తుంది. స్టాల్ ఉదయం 7:30 నుంచి 11:30 వరకు తెరిచి ఉంటుంది. సాదా దోస ధర రూ.10, మటన్ కరి దోస ధర రూ. 150. సాదా దోసెతో మొదలైతే.. మటన్ కరి దోస, చికెన్ కరి దోస, రొయ్యల కరి దోస… ఇలా వివిధ దోస రకాలను రుచి చూసేందుకు స్థానికులు స్టాల్ ముందు ఓపికగా క్యూ కడతారు. వివిధ ప్రాంతాల నుండీ వస్తున్నారు. ఆమె ఫుడ్ స్టాల్ ముందు ఇప్పుడు ఉదయం పూట భారీ క్యూలే ఉంటాయి. చిరునవ్వుతో అందిస్తున్న ఆ దోసె తిని.. నిండైన కడుపుతో వెళతారు.
సొంతకాళ్ళపై నిలబడాలనే
ఫుడ్ స్టాల్ అంటే.. శారీరక శ్రమే కాదు, ఎక్కువ సమయం నిలబడే ఉండాలి. స్టాల్ పెట్టటానికి ముందు కుటుంబసభ్యులు ఇష్టపడలేదు. కాలు లేకపోయినా.. సొంతకాళ్ళపై నిలబడాలని దృఢ నిశ్చయమే ఆమెను నిలబెట్టింది. ‘నేను ఏదైనా సాధించాలనుకున్నాను. నా సొంత బ్రాండ్‌ను సృష్టించాలనుకున్నాను. నా పరిమితులను అధిగమించాలి. రోజూ ఎనిమిది గంటలపైనే డెస్క్ జాబ్ చేయగలిగిన నేను.. నాలుగు గంటలు ఎందుకు నిలబడలేను?’ అనుకుంది. చివరికి తన కుటుంబాన్ని ఒప్పించగలిగింది వీణ. షాపింగ్, వంట, వడ్డన అన్ని పనులు ఆమే స్వయంగా చేసుకుంటుంది. వృత్తిరీత్యా ఫిట్‌నెస్ ట్రైనర్ అయిన ఆమె భర్త ప్రతిరోజూ బండిని సెటప్ చేయడంలో ఆమెకు సహాయం చేస్తున్నాడు. రోజుకు నాలుగు గంటలకు పైగా నిలబడటం వల్ల ఆమె కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నది. కానీ చేసే పనిలో సంతృప్తీ, సంతోషం వీణను ముందడుగు వేయిస్తుంది. ఏసీ ఆఫీసులో ఉద్యోగం నుండి.. వీణ ఇప్పుడు బెంగళూరు వీధిలో.. విపరీతమైన పోటీతో కూడిన స్ట్రీట్ ఫుడ్ మార్కెట్‌లో ఎంతో ఉత్సాహంగా, విజయవంతంగా పనిచేస్తున్నది.
– కె లలిత