ట్రెజరీలోనే వడగండ్ల పరిహారం నిధులు విడుదలైనా పంపిణీ కాని వైనం

– ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు
దిక్కుతోచని స్థితిలో వరంగల్‌ రైతులు
వడగండ్ల వర్షాల పరిహారం పంపిణీకి నోచుకోవడం లేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేసినా ట్రెజరీ లోనే ఉండి పోయాయి. మార్చిలో భారీ వర్షాలు, వడగండ్లతో వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో పెద్దఎత్తున పంట నష్టం జరిగింది. రెండు జిల్లాల్లో 76 వేల ఎకరాల్లో పంటలను రైతులు నష్టపో యారు. 64 వేల మంది రైతులు నష్టాల్లో కూరుకున్నారు. వీరిని ఓదారుస్తూ సీఎం కేసీఆర్‌ పరిహారం ప్రక టించారు. కౌలు రైతులనూ ఆదుకుం టామని హామీ ఇచ్చారు. చెప్పినట్టే రూ.67.12 కోట్లు నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కానీ, అవి పంపిణీకి నోచుకోలేదు. అధికారులంతా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కార్యక్రమాల్లో నిమగ మయ్యారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వడగండ్ల వర్షాలు వరంగల్‌, హన్మకొండ జిల్లాలను తీవ్రంగా దెబ్బతీశాయి. వరంగల్‌ జిల్లాలో ఎక్కువ నష్టం జరిగింది. జిల్లాలో 57 వేల 855 ఎకరాల్లో 56 వేల 843 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్టు అధికారులు నిర్ధారించారు. హన్మకొండ జిల్లాలోనూ 6 వేల 200 ఎకరాల్లో 7,340 మంది రైతులు పంటలను నష్టపోయారు.
వరంగల్‌ జిల్లాలోని 11 మండలాల్లో 81 గ్రామాల్లో మొక్కజొన్న, 91 గ్రామాల్లో మిర్చి పంట భారీగా దెబ్బతింది. ఉద్యానపంటలు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి. నష్టపరిహారం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంలో కొంత జాప్యం జరిగింది.
ఈ క్రమంలో ఎన్నికల సంఘం శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి కేంద్రీకరించి సన్నాహక సమావేశాలను వేగవంతం చేసింది. కలెక్టర్లతోపాటు రెవెన్యూ యంత్రాంగం ఈ పనుల్లోనే నిమగమయ్యారు.
దీంతో పంట నష్టపరిహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ట్రెజరీలో మూలుగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాకముందే నష్టపరిహారం పంపిణీ చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.
ట్రెజరీలోనే రూ.67.12 కోట్లు
దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్‌ నర్సంపేట నియోజకవర్గం అడవి రంగాపురంలో స్వయంగా పరిశీలించారు. రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు నష్టపరిహారం ప్రకటించారు. ప్రభుత్వం రూ.67.12 కోట్లు విడుదల చేసింది. అయితే, ఈ నిధులు ట్రెజరీలోనే వున్నాయి. గత ఏడాది జనవరిలో కురిసిన వడగండ్ల వర్షాలకు జిల్లాలో మిర్చి, మొక్కజొన్న పంటలు 16 వేల 810 ఎకరాల్లో దెబ్బతిన్నట్టు అంచనా వేసి రూ.8.89 కోట్ల నష్టపరిహారాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దాన్ని రైతులకు పంపిణీ చేసింది. గతంలో ఎప్పుడూ వర్షాలకూ దెబ్బతిన్న పంటలకు పరిహారం ప్రకటించిన దాఖలాలు లేవు. విమర్శలు రావడంతో గత ఏడాది జనవరిలో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ప్రకటించి, నిధులు విడుదల చేయడమే కాకుండా, తాజా వడగండ్ల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి బాధిత రైతాంగాన్ని ఓదార్చడానికి సీఎం కేసీఆర్‌ రావడం పట్ల రైతాంగానికి కాస్త ఊరటనిచ్చింది. వెంటనే నష్టపరిహారాన్ని పంపిణీ చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.