
– తండ్రి కర్మలకు బిక్షాటన
– మాజీ దళకమాండర్ గణేష్ ఆవేదన
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
సుమారు 14 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉండి, గత 2016 సంవత్సరంలో జనజీవన స్రవంతిలో కలిసినా గాని, నేటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని, దాంతో అప్పుల ఊబిలో కూరుకు పోయి, కుటుంబ పోషణకై ఆర్ధికంగా, మానసికంగా, సామాజికంగా సతమతమవుతున్నట్లు మండల పరిధిలోని బాటన్ననగర్ గ్రామంలో నివసించే మాజీ దళకమాండర్ గణేష్ వాపోతున్నారు. ఈ మేరకు బుధవారం మండల కేంద్రంలో తన తండ్రి కోరం జగ్గయ్య కర్మకాండలు నిర్వహించడానికి ఆర్ధిక స్తోమత లేక బిక్షాటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజోలు గ్రామం, సుజాతనగర్ మండలంలో నివసించే తన తండ్రి కోరం జగ్గయ్య సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీలో, ప్రజాపందా మాస్ లైన్ పార్టీలో సుజాతనగర్, జూలూరుపాడు సంయుక్త మండలాల్లో ఎస్ డి ఎల్ సి సభ్యుడిగా, రైతు సంఘం డివిజన్ కమిటీ సభ్యుడిగా 35 సంవత్సరాలు పైగా పనిచేశారని చెప్పారు. గత నెల మార్చి 31న అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిపారు. దీనికి ముందు, పిడిఎస్ యు విద్యార్థి నాయకుడిగా పని చేసి తాను (గణేష్), 2003 సంవత్సరంలో శ్రీరామచంద్ర డిగ్రీ కాలేజీలో బిఏ చదివి, రాష్ట్ర ప్రభుత్వం నక్సల్స్ పార్టీలతో చర్చలు జరుగుతున్న సందర్భంలో తొలుత నలక్సల్స్ లో చేరానన్నారు. మావోయిస్టు విలీనం అవుతున్న సందర్భంలో జనశక్తి పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి అమరుడు రంగన్న కుమారుడు సుదర్శన్ నాయకత్వంలో తనతో పాటు పలువురు జనశక్తి పార్టీలో చేరారని తెలిపారు. అనంతరం తాను తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఖమ్మం ఏరియాల్లో కమాండర్ గా, ఏరియా కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టానన్నారు. ఆ క్రమంలో అనేక ఎన్కౌంటర్లు, అరెస్టులు, లొంగుబాట్లు జరిగాయని చెప్పారు. దాంతో తాను ఎన్డీ పార్టీలో చేరానని తెలిపారు. 14 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉండగా తాను తునికాకు కట్ట రేటు పెంపుకై, రోడ్లు, కుంటలు, చెరువులు నిర్మాణాలకై, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలకై, కార్మికుల హక్కులకై, వ్యవసాయ కూలీల రేట్లు నిర్ణయించడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రజలు, కుటుంబాల మధ్య ఏర్పడిన గొడవలను పరిష్కరించినట్లు వివరించారు. అలాగే లక్షలాది ఎకరాల పోడు భూమి ప్రజలకు దక్కాలని పోరాడినట్లు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఉద్యమంలో భాగస్వామిని అయ్యానని, పార్టీలో జరుగుతున్న సిద్ధాంత ఆచరణ వైరుధ్యాలు తాళలేక తాను ఎన్డీ రాయల వర్గాన్ని బలపరిచానని అన్నారు. ఇంతలో తల్లిదండ్రుల వృద్ధాప్యం మూలంగా వస్తున్న అనారోగ్యం, వ్యక్తిగత సమస్యల నేపథ్యంలో 2016 సంవత్సరంలో జనజీవన స్రవంతిలో కలిశానని చెప్పారు. నాటి నుంచి ప్రభుత్వం ద్వారా పునరావాసం అందక కుటుంబ పోషణకై పోడు భూమి సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ నిర్మించడం మూలంగా ప్రజలతోపాటు తన పోడు భూమిని చాలా వరకు కోల్పోయని వాపోయారు. మిగిలిన తన కొంత పోడు భూమికైనా పట్టా ఇవ్వాలని సమ్మక్క సారక్క దేవతల మాల ధరించి, కాషాయ దుస్తులతో పోరాటం చేశానని చెప్పారు. ప్లాంటేషన్ నిర్మాణంలో పోగా మిగిలిన పోడు భూమిలో పంటలు సరిగా పండక పోవడం, గిట్టుబాటు ధరలు లేకపోవడంతో ప్రస్తుతం అప్పుల ఊబిలో మునిగి ఉన్నట్లు తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తన తండ్రి అకాల మరణంతో ఈనెల 20వ తేదీన జరిపే తండ్రి కర్మకాండలు, అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించడానికి భిక్షాటన అనివార్యం అయ్యిందని చెబుతున్నారు. కావున విరాళం ఇచ్చే దాతలు తన ఫోన్ నెంబర్ 9494 397016ను సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.