అవునా? సీతమ్మా!

”భారత దేశ రెగ్యులేటర్లు అత్యంత శక్తి వంతులు! నిష్ణాతులు కూడా..!” అన్నది ‘సీతమ్మ’. ఉంగరాల వేళ్ళతో సుప్రీం మొట్టికాయల తర్వాత ఒక ప్రధాన ‘నిష్ణాత రెగ్యులేటర్‌’ ఏమిచేస్తున్నదో తెలుసుకోవడానికే అనుకుంటా బహుశా భారత విత్తమంత్రి ఆర్‌.బి.ఐ. బోర్డు మీటింగుకు హాజరై ఉంటారు. మీరు పెద్ద కోర్టులో చెప్పాల్సిన మాటలు ముందే మీడియాకి చెప్పి ‘సబ్‌ జుడైస్‌’ కేసులో ఎందుకు ఇరుక్కుంటారులేండి? మీరు చెప్పిన అత్యంత పురాతన రెగ్యులేటర్‌, రిజర్వు బ్యాంకు, సుప్రీం మొట్టికాయల దాకా ఎందుకు తెచ్చిందనేదే నేడు మీడియా ప్రశ్న! సగటు భారతీయుడు అడుగుతున్న ప్రశ్న. ”ఇప్పటిదాకా షేర్‌ మార్కెట్‌ మదుపుదారులకు జరిగిన నష్టం భవిష్యత్‌లో జరుగకుండా ఉండాలంటే మేము ఏమి చేయాలి? 20వ తేదీకల్లా తేల్చమ”ని మరో కీలక నియంత్రణా సంస్థ సెబీకి దాదాపు వార్నింగ్‌ ఇచ్చింది సుప్రీంకోర్టు. తామే ఒక ఎక్స్‌పర్ట్‌ ప్యానెల్‌ ఏర్పాటు చేస్తామని చెప్పింది. ప్రభుత్వం గీసిన గీతల మధ్యే నడిచే ‘నిష్ణాతులు’ సర్కారీ నిష్ణాతులనేగా సుప్రీం అభిప్రాయం. అందుకేనేమో హడావుడిగా ఒక ఎక్స్‌పర్ట్‌ ప్యానెల్‌కు పచ్చజెండా ఊపింది ప్రభుత్వం!
కొన్ని కీలక ప్రశ్నలను ఇక్కడ ప్రస్తావించాలి. మొత్తం షేర్‌ హౌల్డర్ల ప్రయోజనాలు కాపాడే నిష్ణాతులకమిటీనా, అదానీని కాపాడే కమిటీనా దేశానికి కావల్సింది? సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) కచ్చితంగా అత్యంత నైపుణ్యం కలిగిన నిష్ణాతులతో నిండిన సంస్థే! దానిలో ఎవరికీ సందేహం ఉండాల్సిన పనిలేదు. సమస్య ‘సెబీ’ది కాదు. దాన్ని నియంత్రించే పాలకులది. అదానీతో, అంబానీతో చెట్టాపట్టాలేసుకున్న పాలనది. 2017లో ఎకనామిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ నాటి సంపాదకుడు పరంజరు గుహా ఠాకూర్తా అదానీ మోసాల గురించి మొట్టమొదట ప్రస్తావించారు. అంత ప్రతిష్టాత్మక సంస్థ ఆయనకి ఉద్వాసన పలికే దాకా విశ్రమించలేదు మోడీ-1 సర్కార్‌. 2019లో మొదటిసారి, 2020లో రెండవసారి, 2022లో 3వసారి తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యురాలు మహువా మొయిత్రా లోక్‌సభలో అదానీ ‘దందా’ గురించి ప్రస్తావిస్తే ఆర్థికశాఖ మంత్రులు సెబీ తీవ్రంగా పరిశీలిస్తోందని (సెబీ ఈజ్‌ సీజ్డ్‌ ఆఫ్‌ ద మ్యాటర్‌) సమాధానం చెప్పారు. తోటకూర కాడలు దొంగిలించినప్పుడే దండించి ఉంటే ఇంత పెద్ద దొంగనై జైలుకి పోవాల్సిన స్థితి రాకపోనుకదా!” అని దొంగరాముడు సినిమా చివరిడైలాగు గుర్తుచేసుకోవాలి! 2017 నుండి 2023 దాకా ఆరేండ్ల పాటు సెబీ తేల్చలేక పోయిందా? తేల్చే నైపుణ్యం అసలు దానికి లేదా? ఎవరైనా అడ్డు పడ్డారా? సెబీని అడ్డుకోగల శక్తివంతులెవరు? అదానీ షేరు ధర రూ.2000 ఉండగా మొన్న ఆయన ఎఫ్‌పిఒకి వెళితే చివరి నిముషంలో ముఖేష్‌ అంబానీ, నవీన్‌ జిందాల్‌ వంటివారు రూ.3200 పెట్టి భారీగా ఎందుకు కొన్నారు? అదానీ చాలా శక్తివంతుడే అని ప్రపంచానికి రుజువుచేసేందుకేనా? మొత్తం రూ.20వేల కోట్ల డబ్బును తోటిపెట్టుబడిదారులందరికీ తిరిగి చెల్లించేశాడాయన. ఇవన్నీ సెబీ పట్టించుకోవాల్సినవి కావా? దాని వాచ్‌డాగ్‌ పనిలో వీటన్నిటినీ చూసి కూడా కరవకపోతే పోయే, కనీసం మొరగదా? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.మారిషస్‌ వంటి చోట్ల తన డొల్లకంపెనీల ద్వారా మనీలాండింగ్‌ చేశాడని, రౌండ్‌ ట్రిప్పింగ్‌కి పాల్పడ్డాడని అదానీపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరగదా? సుప్రీంకోర్టు అభిప్రాయాలను కూడా ఒక ‘లీడ్‌’గా వాడుకున్న సర్కార్‌ షేర్‌ మార్కెట్‌లో డబ్బు కోల్పోయిన మదుపుదారుల రక్షణ అనే పేర అదానీకే అండగా నిలబడటం సరైందేనా? డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ (డి.ఆర్‌.ఐ) అసలు మనదేశంలో ఉందా? పనిచేస్తోందా? అనే సందేహం ఎవరికైనా రాక మానదు. అదానీ సంపద ఈ స్థాయిలో పెరిగింది ఈ మూడేండ్లుగానేగా! ఆయన్ని మూడో నెంబర్‌లోకి తేవడం కోసమేనా గత ఆరేండ్లుగా సెబీ సప్పుడు చేయంది! ఇప్పుడేమైంది? ఆయన జారుడు బండమీద జారి జారి పదిహేడో స్థానానికి చేరాడు కదా! మోడీ నుండి కేటీఆర్‌ వరకు పెట్టుబడులు దేశంలోకి దొర్లుకుంటూ వచ్చేస్తున్నాయని గప్పాలు కొడుతున్నారు కదా! భారత నియంత్రణా వ్యవస్థలపై నమ్మకం సడలిపోయిన తర్వాత ప్రపంచంలో ఏ పెట్టుబడిదారుడైనా ఇటువైపు తొంగిచూస్తారా? ‘అదానీ’ అస్తమించని సామ్రాజ్యంలో చీకటి పడకుండా దివిటీలు పట్టుకు కాపలాకాసే వ్యక్తులు, వ్యవస్థలూ ఇంకా ఉన్నాయా? వాటిని నియంత్రించగలిగితేనే మన రెగ్యులేటరీ వ్యవస్థ సరిగా ఉన్నట్టు లెక్క సీతమ్మా!