నవతెలంగాణ – కమ్మర్ పల్లి
పశువులకు తప్పనిసరిగా యజమానులు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలని మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు నివారణ టీకాల శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో గ్రామంలోని 72 గోజాతి, 109 గేదేజాతి పశువులకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా మండల పశువైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ రావు మాట్లాడుతూ.. ప్రతి పశువుకు తప్పకుండా టీకా వేయించుకోవాలని సూచించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి పశువులకు తప్పనిసరిగా గాలికుంటు నివారణ టీకాలు వేయించాలన్నారు. అనంతరం గాలి కుంటు వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పశువుల యజమానులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది వెటర్నరీ అసిస్టెంట్ చిత్ర సాయి, హెచ్ఏ స్వప్న, ఓఎస్ సత్యం, గోపాలమిత్ర స్పరన్, పశువుల యజమానులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.