
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ప్రతి కూలికి జాబ్ కార్డు ఇవ్వాలని, కూలీలందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సారా సురేష్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని హస కొత్తూర్ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సారా సురేష్ మాట్లాడుతూ ప్రతి కూలికి జాబ్ కార్డు, గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. కూలీలందరికీ ప్రతివారం డబ్బులు చెల్లించాలని, ప్రతి మనిషికి 200 రోజులకు తగ్గకుండా పని కల్పించాలన్నారు. పని ప్రదేశంలో నీటి వసతి కల్పించడంతోపాటు కూలీలు సేన తీరేందుకు టెంట్ సౌకర్యం కల్పించాలన్నారు.,పనిచేసే సందర్భంలో చిన్నచిన్న గాయాలు అయితే ప్రథమ చికిత్స కోసం మందుల కిట్లను, గుల్కోస్ పౌడర్ సరఫరా చేయాలని కోరారు.కొలతలు లేకుండా పని కల్పించాలని, ప్రతి కూలికి రూ.ఆరు వందలు రోజువారీగా ఇవ్వాలన్నారు. 2006లో ఇచ్చిన జాబ్ కార్డులు తప్ప ఇంతవరకు జాబ్ కార్డులు ఇవ్వలేదని వెంటనే కొత్త జాబ్ కార్డులు ఇవ్వాలన్నారు. పనిముట్లు ఇవ్వాలని, గడ్డపారలు సాన పెట్టించుకునేందుకు అదనంగా డబ్బులు చెల్లించాలని, కూలీలకు ఆటో చార్జీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారందరికీ రూ.పది లక్షల ఇన్సూరెన్స్ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం కమ్మర్ పల్లి మండల అధ్యక్షులు వుట్నూర్ బాలయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా కోశాధికారి బి.అశోక్, సత్యక్క, తదితరులు పాల్గొన్నారు.