ప్రతి హామీని చిత్తశుద్ధితో నెరవేరుస్తాం

ప్రతి హామీని చిత్తశుద్ధితో నెరవేరుస్తాం– మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ-కాశిబుగ్గ/హనుమకొండ చౌరస్తా
ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో అమలు చేస్తామని వరంగల్‌ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండ, వరంగల్‌ పట్టణాల్లో మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 11 అభివృద్ధి పనులను రూ.68 కోట్లతో పనులు ప్రారంభించారు. కె-హబ్‌, భారత రత్న పీవీ నరసింహారావు నాలెడ్జ్‌ సెంటర్‌, మెన్స్‌ హాస్టల్‌, సమ్మక్క, సారలమ్మ ఉమెన్స్‌ హాస్టల్స్‌, అకాడమిక్‌, అకాడమిక్‌ బ్లాక్‌ 3, ఎంబీఏ బిల్డింగ్‌, మెన్‌ డైనింగ్‌ హాల్‌, అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌ రెండో ఫ్లోర్‌, కాంపౌండ్‌ హాల్‌, తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం పూర్తయిన భవనాలను పరిశీలించారు. హన్మకొండలోని సమ్మయ్యనగర్‌లో సమగ్ర వరద నీటి కాలువల నిర్మాణానికి శంకుస్థాపన, బాలసముద్రంలోని చిల్డ్రన్స్‌ పార్క్‌ ఆధునీకరణ పనులకు సంబంధించిన శిలాఫలకాల్ని ఆవిష్కరించారు. వికలాంగులకు వెహికల్స్‌, లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని కాదని రెండు పర్యాయాలు కేసీఆర్‌కు అవకాశం ఇస్తే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇస్తామని, ఇవ్వకుండా మోశారని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చామని, ఆ హామీలో భాగంగా అధికారంలోకి వచ్చిన 72 రోజుల్లో 31వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. 75 రోజుల్లో 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చినట్టు తెలిపారు. గత ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు ఇచ్చి పేపర్‌ లీకేజీకి పాల్పడితే తాము అధికారంలోకి వచ్చాక యుద్ధ ప్రాతిపదికన అవినీతి అధికారులను తొలగించి నిజాయితీపరులైన అధికారులు నియమించినట్టు తెలిపారు. ప్రజా పాలన ద్వారా అధికారులే ప్రజల వద్దకు వెళ్లి వారి అవసరాలు తెలుసుకున్నారని, తాము ప్రజల అవసరాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు 15తేదీ వరకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, తాము అధికారంలోకి వచ్చాక 1 నుండి 3వ తేదీ లోపు జీతాలు చెల్లిస్తున్నామన్నారు. ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందన్నారు. కాకతీయ యూనివర్సిటీ యూనివర్సిటీ ఏర్పాటైనప్పటి నుంచి కాంపౌండ్‌ లేదని, యూనివర్సిటీ భూములు కబ్జా కాకుండా సర్వే చేసి కాంపౌండ్‌ వాల్‌ నిర్మించనున్నట్టు తెలిపారు. 11వ తేదీన భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్టు చెప్పారు. కార్యక్రమాల్లో నగర మేయర్‌ గుండు సుధారాణి, వరంగల్‌ పశ్చిమ, వర్ధన్నపేట, మహబూబాబాద్‌ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు, భూక్య మురళీనాయక్‌ కార్పొరేటర్లు, హన్మకొండ జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, కాకతీయ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ఆచార్య రమేష్‌ తదితరులు ఉన్నారు.