ప్రతి ఒక్క రూపాయి సమాజ సేవకే..

Every rupee is for community service.‘బ్లడ్‌ డొనేషన్‌ సొసైటీకి చాలా గొప్ప డొనేషన్‌. మీరు ఇచ్చే ప్రతిరక్తపు బిందువు చాలా జీవితాలని నిలబెడుతుంది. ఈ గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఫిబ్రవరి 15న ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ యూఫోరియా మ్యూజికల్‌ నైట్‌ షోని నిర్వహిస్తున్నాం’ అని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ అద్వర్యంలో ఫిబ్రవరి15న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ యూఫోరియా మ్యూజికల్‌ నైట్‌ షో జరగనుంది.
ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సంగీత దర్శకుడు తమన్‌, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సిఈవో రాజేంద్ర కుమార్‌, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సివోవో గోపి పాల్గొన్నారు.
నారా భువనేశ్వరి మాట్లాడుతూ, ‘ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జెనిటిక్‌ డిజార్డర్‌ తలసేమియాతో చాలా మంది పిల్లలు, పెద్దలు బాధపడుతున్నారు. ఈ వ్యాధి ఉన్న వారికి బ్లడ్‌లో హిమోగ్లోబిన్‌ చాలా తక్కువగా ఉంటుంది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇది తీవ్రంగా వచ్చినప్పుడు రక్త మార్పిడి వెంటనే జరగాలి. దీనికి చాలా రక్తం అవసరం. ఆ రక్తాన్ని అందించే బృహత్తర కార్యక్రమమే ఇది. సంగీత దర్శకుడు తమన్‌ ఆధ్వర్యంలో మ్యూజికల్‌ నైట్‌ షోని నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కుటుంబసమేతంగా వచ్చి ఈ షోలో పాల్గోవాలని కోరుకుంటున్నాను. టికెట్స్‌ బుక్‌ మై షోలో అందుబాటులో ఉంటాయి. ఆడియన్స్‌ ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయి తిరిగి సమాజ సేవకే వినియోగిస్తాం’ అని తెలిపారు.