అడుగడుగునా అన్యాయమే..

Every step It's unfair..– ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు దుస్థితి
– రెండు నదులు ఉన్నా అందని సాగునీరు
– నడిగడ్డ ప్రాంతాన్ని చూస్తే కండ్లకు నీరు వచ్చేది
– పాలమూరు గోస చూసి ఉద్యమం మొదలుపెట్టాం
– మరోసారి కాంగ్రెస్‌కు ఓటు వేసి పొరపాటు చేయొద్దు : ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌
నవ తెలంగాణ – మహబూబ్‌ నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
”నేను తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమం ప్రారంభించిన మొదటి దశలో అలంపూర్‌ వచ్చాను. ఇక్కడ కూతవేటు దూరంలో కృష్ణా, తుంగభద్ర నదులు ఉన్నా సాగునీరు లేక భూములు బీళ్లుగా మారాయి. ఉపాధి లేక దుబాయి, ముంబయి వంటి ప్రాంతాలకు వలస పోయేవారు. ఆరిగోసల విముక్తికి ఏకైక మార్గం ప్రత్యేక రాష్ట్రమేనని తలంచి జోగులాంబ నుంచి ఆర్డీఎస్‌ వరకు పాదయాత్ర చేశాను. ఈ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రం ద్వారానే సాగునీరు అందుతుందని ఆనాడే చెప్పానని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ఆదివారం అలంపూర్‌, కొల్లాపూర్‌, నాగర్‌ కర్నూల్‌, కల్వకుర్తి నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఫ్యాక్షనిజం గుండాయిజానికి తావు లేదన్నారు. ప్రజలు వజ్రాయుధమైన ఓటును దుర్వినియోగం చేసుకోరాదని పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో దోపిడీ, రైతాంగ సమస్యలు, పాలమూరు వలసలు, సాగునీటి వంటి సమస్యలను ఏ పార్టీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, గద్వాల జిల్లాలకు అతి సమీపంలో కృష్ణ తుంగభద్ర నదులు ఉన్నప్పటికీ సాగు తాగునీరుకు నోచుకోకపోవడం పాలకుల వైపల్యమే అని గుర్తు చేశారు. తొమ్మిదేండ్ల క్రితం తెలంగాణ ప్రాంత దుస్థితిని ఆ తర్వాత జరిగిన అభివృద్ధిని ఒకసారి పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. 55 ఏండ్ల గోసల తర్వాత వచ్చిన తెలంగాణలో ప్రాజెక్టులను పూర్తిచేసుకుని.. సాగు, తాగునీరు కల్పించిన ఘన చరిత్ర బీఆర్‌ఎస్‌కు ఉందన్నారు. కాంగ్రెస్‌ వైఫల్యాల వల్లే తెలంగాణలోని బోయలు బీసీలుగా ఉన్నారని, ఈసారి ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బోయలను ఎస్టీల్లో చేర్చుతానని హామీ ఇచ్చారు. ఆర్డీఎస్‌ దుస్థితి వల్లనే తుమ్మిలను పూర్తి చేసి 35,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. మల్లమ్మ కుంట రిజర్వాయర్‌ పూర్తి చేయడమే గాక చిన్నోని పెళ్లి ఎత్తిపోతలను పూర్తి చేశామన్నారు. అలంపూర్‌లో 100 పడకల ఆస్పత్రితో పాటు ఇతర పనులను మిషన్‌ కాకతీయ ద్వారా పూర్తి చేసుకుందామన్నారు. పక్క రాష్ట్రం కర్నాటకలో అమలు చేయలేని పథకాలను తెలంగాణలో కాంగ్రెస్‌ ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు. ధరణి తొలగిస్తే రైతుబంధు వంటి అనేక పథకాలు రైతుల ఖాతాలో ఎలా జమ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి పథకాలు సంపూర్ణంగా అమలు కావాలంటే మరోసారి బీఆర్‌ఎస్‌ గెలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రి నిరంజన్‌ రెడ్డి, ఎంపీ రాములు, , అలంపూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌ రెడ్డి, నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్‌ రెడ్డి, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్‌ యాదవ్‌, నాయకులు జక్క రఘునందన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.