– బయట పోట్లాడుతం.. సభలో మాట్లాడుతం
– ప్రజల గోస పట్టని పార్టీలకెందుకు ఓటెయ్యాలి
– బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే వేరు.. విధానాలొక్కటే
– రాజ్యాంగాన్ని పాతాళానికి తొక్కుతున్న బీజేపీని కేసీఆర్ ప్రశ్నించగలడా?
– నోట్ల కట్టలకు ఆశపడితే భవిష్యత్ నాశనమే
– అదనపు పని గంటలతో కార్మికులతో పాటు ఐటీ ఉద్యోగులూ ఇక్కట్లు
– సీపీఐ(ఎం) గెలిస్తేనే పేదలు, కార్మికులకు లాభం : అమీన్‌పూర్ బహిరంగ సభలో బీవీ రాఘవులు
నవతెలంగాణ-మెదక్‌ప్రాంతీయప్రతినిధి
ఎర్రజెండాకు వేసే ప్రతి ఓటూ పాలకుల గుండెల్లో పేలే తూటా లాంటిదని, ప్రజల సమస్యలపై పోరాడేందుకు మరింత శక్తిని పెంచేందుకు దోహదపడుతుందని సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. ప్రజల కోసం బయట పోట్లాడుతాం.. చట్ట సభల్లో మాట్లాడుతామని స్పష్టం చేశారు. ఓట్లు, సీట్లు వచ్చినా రాకపోయినా కార్మిక వర్గం, పేదల ప్రయోజనాల కోసమే పోరాడుతామన్నారు. ఇతర పార్టీలేవైనా బయటా.. చట్టసభల్లో.. ప్రజల గురించి ఆలోచిస్తాయా.. అని ప్రశ్నించారు. పటాన్‌చెరు నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి జె.మల్లిఖార్జున్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సంగారెడ్డి జిల్లాలోని బీరంగూడ మండే మార్కెట్‌లో నాయకులు నర్సింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభకు ఆయన హాజరై మాట్లాడారు. పళ్లూడ గొట్టుకోవడానికి ఏ రాయి అయినా పర్వాలేదు అన్నట్టుగా ప్రజల గురించి ఆలోచించని ఏ పార్టీకి ఓటు వేసినా వృధానే అవుతుందన్నారు. ”మేముండగానికి ఇండ్లు ఇచ్చారా..? మేం బతకాడిని మా జీతం పెంచారా..? పీఎఫ్, ఈఎస్‌ఐ సదుపాయం కల్పించారా..? మా పేదరికం పోయేందుకు ఆలోచించారా..? ఇన్నాళ్లు పాలించి ఏం చేశారో చెప్పండి” అని పాలక పార్టీలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పరిశ్రమల యజమానులకు సాయపడటం తప్ప ఏ నాడైనా కార్మికులు, పేదల గురించి మాట్లాడని, కొట్లాడని పార్టీల అభ్యర్థులిచ్చే నోట్ల కట్టలకు ఆశపడితే మన భవిష్యత్ నాశనమై గోస పడతామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పరంగా వేరైనప్పటికీ విధానాల పరంగా రెండూ ఒక్కటేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే లేబర్‌కోడ్‌లు తెచ్చేందుకు ఆలోచన చేస్తే.. అప్పట్లో సీపీఐ(ఎం) పోరాడడంతో ఆగిపోయాయని గుర్తు చేశారు. ఆ లేబర్ కోడ్‌లను బీజేపీ అమలు చేస్తోందన్నారు. ఆస్తి పన్నులు బాగా పెంచితేనే అప్పులు తీసుకోవడానికి వీలుంటుందని, స్మార్ట్ మీటర్లు, టైం టారిఫ్ పెట్టి విద్యుత్ సబ్సిడీలు ఎత్తేయాలని బీజేపీ ఆయా రాష్ట్రాలకు లేఖలు రాసిందన్నారు. రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వాలు.. బీజేపీ అమలు చేసే ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేయకుండా ఎవరైనా అడ్డుపడతారా అని ప్రశ్నించారు. సామాజిక న్యాయాన్ని నాశనం చేస్తూ రాజ్యాంగాన్ని పాతాళానికి తొక్కేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు. బీజేపీ చేసే రాజ్యాంగ వ్యతిరేక విధానాల్ని కేసీఆర్ ప్రశ్నించగలడా అని ప్రశ్నించారు. ఎతైన అంబేద్కర్ విగ్రహం పెడితే చాలదని, ఆయన ఆశయాలను దెబ్బతీస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. అదానీ లక్షల కోట్ల నల్లధనాన్ని బయటికి పంపించి తెల్ల ధనంగా మార్చుకున్నట్టు ఆధారాలు బయటపడినా విచారణ సంస్థలు మాత్రం ఆయనకు క్లీన్ చీట్ ఇవ్వడం దుర్మార్గమన్నారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చరిత్రను అర్ధం చేసుకొని ప్రజలు నిజాయితీగా పనిచేసే ఎర్రజెండా అభ్యర్థికి ఓటేయాలని కోరారు. పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలో లక్షలాది మంది కార్మికులున్నారని, వీరికి కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సదుపాయాల కోసం సీపీఐ(ఎం) నికరంగా పోరాడిందన్నారు. కనీస వేతనాల సలహా మండలిని వేయాలని పోరాడిన ఫలితంగా ప్రభుత్వం చొరవ చూపిందన్నారు. పరిశ్రమల్లో వలస కార్మికులే కాదు ఐటీ ఉద్యోగులు సైతం అదనపు పని గంటలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్మికులు, ఉద్యోగులు, పేదల కష్టాలు తెలిసిన మల్లిఖార్జున్‌ను గెలిపించుకోవడం ద్వారా ప్రభుత్వంతో కొట్లాడి సమస్యల్ని పరిష్కరింపచేసుకునే అవకాశం కలుగుతుందన్నారు.
కార్మిక వర్గం ప్రయోజనాలే ప్రధానం: చుక్క రాములు
కార్మిక వర్గం ప్రయోజనాలు తప్ప మరే ప్రయోజనాలు లేవని స్పష్టమైన రాజకీయ విధానాన్ని ప్రకటించే పార్టీ ఒక్క సీపీఐ(ఎం) మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు స్పష్టంచేశారు. ఈ విధానాన్ని చెప్పగల్గిన దమ్ము బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీఎస్పీలకు ఉందా అని ప్రశ్నించారు. పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలో లక్షలాది మంది కార్మికుల పక్షాన సీపీఐ(ఎం) పోరాడిందన్నారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఇతర పార్టీల అభ్యర్థులు ఏనాడైనా కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని అడిగిన పాపాన పోలేదన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గం కాలుష్య కుంపటిగా మారిందన్నారు. బొల్లారం, అమీన్‌పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీల చేసి భూముల్ని కాజేయడం తప్ప అభివృద్ధి చేసిందిలేదని ఆరోపించారు. సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహరావు, జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు అడివయ్య, ఐద్వా రాష్ట్ర నాయకులు ఆశాలత, సీపీఐ(ఎం) అభ్యర్థి మల్లిఖార్జున్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.రాజయ్య, బి.మల్లేశం, సాయిలు, రామచంద్రం, నాయకులు పాండురంగారెడ్డి, వాజీద్ అలీ, జార్జ్, అనంతకుమార్, శాంతకుమార్, రాజు, బాగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.