ఒక్కో ఓటే బూస్ట్‌

రాష్ట్రంలో పార్లమెంట్‌ ఎన్నికలను కులాలు, మతాలు, డబ్బుల చుట్టూ తిప్పే ప్రయత్నాల్లో పార్టీల నేతలు మునిగి పోయారు. సేవా గీవా జాన్తానై..పైసామే పరమాత్మ.. కులపోళ్ల ఓట్లే రక్ష అన్నట్టుగా నేతలతీరు సాగుతున్నది. వ్యాపారాల్లో వందల కోట్ల రూపాయలు సంపాదించు కోవడం, దాన్ని రక్షించుకోవడం కోసం, వారసులకు రాజకీయ భిక్ష పెట్టడంలో భాగంగా పదవుల కోసం పాకులాడుతున్న పరిస్థితి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. కష్టాల్లో ఉన్నారని తెలిసి కూడా కనికరం లేకుండా లక్షల సొమ్మును తిన్నోళ్లు…కోట్లాది రూపాయల సంపదను కాపాడుకోవాలను కునేటోళ్లు..పుత్ర రత్నాలను పదవుల్లో చూసుకుని మురిసే టోళ్లు అభ్యర్థులైతే దోచుకోవడం తప్ప ఇక ప్రజాసేవ ఎక్కడుంటుంది? మహనీయుడు శ్రీశ్రీ రాసిన కవితను అటూ ఇటూ మార్చుకుని ఏ పార్టీ అభ్యర్థుల చూసినా ఏమున్నది గర్వకా రణం.. కులమత విభజనలతో ప్రజల మధ్య చిచ్చుపెట్టడం, సామదానభేద దండోపాయాలతో ఓట్లను కొల్లగొట్టడం.. ప్రజాసేవ ముసుగులో సంపదను పోగేసుకోవడం.. 500, 1000 రూపాయలు విదిల్చి ఓట్లను దండుకోవడం..ఆ తర్వా త హాహా అనుకోవడం తప్ప ఏమున్నది. పొద్దునలేస్తే ప్రజలు, కార్మికులు, రైతుల సమస్యలపై రోడ్లెక్కి కొట్లాడేటోళ్లు కమ్యూనిస్టులని అంగీకరిస్తూనే ఈ డబ్బుల రాజకీయాల్లో మేం ఒక్కరం ఓటేస్తే వాళ్లు గెలుస్తారా? అందరూ అంటున్నారు. అలా అనుకునేటోళ్లంతా ఒక్కోఓటేసి ప్రజా సేవలో పరితపించేటోళ్ల వైపు నిలవాల్సిన అవసర ముంది. ఎంత పెద్ద విజయమైనా ఒక్కడితోనే ప్రారంభమవుతుం దన్నట్టుగానే ఒక్కోఓటే పోరాటయోధులకు బూస్ట్‌గా పని చేస్తుంది. ఆ దిశగా ప్రజలు ఆలోచించాలని కోరుకుందాం.
– ప్రశాంత్‌ అచ్చిన