కేసీఆర్‌ ప్రతి మాటా అబద్ధమే

Every word of KCR is a lie– బీఆర్‌ఎస్‌ మిగలదన్న భయంలో మాజీ సీఎం
– అతి తక్కువ కాలంలో పతనం కాబోతున్న బీఆర్‌ఎస్‌
– ఆయన ఫ్రస్ట్రేషన్‌, డిప్రెషన్‌లో ఉన్నారు
– నా ఫోన్‌ కూడా ట్యాపింగ్‌ చేశారు :మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పంటపొలాల సందర్శన సందర్భంగా రాష్ట్రంలో నీటి సమస్యపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మాట్లాడిన ప్రతి మాటా అబద్ధమేనని రాష్ట్ర సాగునీటి పారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ మిగలదన్న డిప్రెషన్‌, ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న కేసీఆర్‌ ఏ మాత్రం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో ఓడిపోవడమే కాకుండా దేశ చరిత్రలోనే అతి తక్కువ కాలంలో పతనమైన ప్రాంతీయ పార్టీగా బీఆర్‌ఎస్‌ నిలవబోతోందని ఈ సందర్భంగా ఉత్తమ్‌ జోస్యం చెప్పారు. కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు తప్ప ఆ పార్టీలో ఎవరూ మిగలబోరని చెప్పారు. గొప్పలకు పోయిన కేసీఆర్‌ రెండోసారి గెలవగానే జాతీయ పార్టీగా మార్చుతున్నట్టు చెప్పారని గుర్తుచేశారు. తన రాజకీయ జీవితంలో ఇంత తొందరగా పతనమవుతున్న పార్టీని తానెక్కడా చూడలేదని ఎద్దేవా చేశారు.
నల్లగొండ సభలో జనరేటర్‌ పెట్టుకుని, కరెంట్‌ పోయిందని పచ్చి అబద్ధం చెప్పే స్థితికి కేసీఆర్‌ దిగజారారని ఉత్తమ్‌ ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ పాలనలో వచ్చిన ఒకే ఒక విద్యుత్‌ ప్రాజెక్టు భద్రాద్రి పవర్‌ ప్రాజెక్ట్‌ అని తెలిపారు. కాలం చెల్లిన సాంకేతికతతో అది ప్రజలకు భారంగా మారిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక్క నిమిషం కూడా విద్యుత్‌కు అంతరాయం లేదని స్పష్టం చేశారు. ఎన్టీపీసీకి కేసీఆర్‌ సహకరించి ఉంటే రాష్ట్రానికి 4 వేల మెగావాట్ల విద్యుత్‌ వచ్చి ఉండేదని తెలిపారు. ఖర్చుకు వెనకాడకుండా 24 గంటల కరెంటు సరఫరాతో పాటు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నట్టు చెప్పారు. బీఆర్‌ఎస్‌ హయంలో మొదలుపెట్టిన ఏ విద్యుత్‌ ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని విమర్శించారు.
గత పదేండ్లలో పంట నష్టం జరిగితే రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని కేసీఆర్‌కు సాగునీటి గురించి మాట్లాడే అర్హతే లేదని ఉత్తమ్‌ విమర్శించారు. రైతులకు పంట బీమా ఇవ్వలేదనీ, దేశంలోనే పంట బీమా లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను చేసిన పాపం బీఆర్‌ఎస్‌ దేనని చెప్పారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పజెప్తామని కేసీఆర్‌ ఒప్పుకున్నారని ఆరోపించారు. ఏపీ సీఎం జగన్‌తో కలిసి ఆయన ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌ నగర్‌ జిల్లాలపై కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కంటే కేసీఆర్‌ పాలనలోనే తెలంగాణకు ఎక్కువ ద్రోహం జరిగిందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ సర్కారు నీటి పారుదల రంగాన్ని సర్వనాశనం చేసిందని చెప్పారు. రాష్ట్రంలో వచ్చిన కరువును సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని ఉత్తమ్‌ తెలిపారు. కమిషన్ల కోసం ప్లాన్‌, డిజైన్లు లేకుండా ప్రాజెక్టులు నిర్మించిన మాజీ సీఎంకు కాళేశ్వరం గురించి మాట్లాడేందుకు సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ కట్టిన ప్రాజెక్టు వారి హయాంలోనే కూలిపోయిందని గుర్తుచేశారు. కాళేశ్వరం నిర్వహణ కోసం విద్యుత్‌ ఖర్చు ఏడాదికి రూ.10 వేల కోట్లు అని తెలిపారు. ఈ విషయంపై రైతులకు బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు తటస్థంగా ఉండాలని కేసీఆర్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. పోలీసు శాఖను దుర్వినియోగం చేసిందే కేసీఆర్‌ ఆని మండిపడ్డారు.
నా ఫోన్‌ ట్యాప్‌ చేశారు…ఉత్తమ్‌
బీఆర్‌ఎస్‌ హయాంలో తన ఫోన్‌ను కూడా ట్యాప్‌ చేశారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌కు చెందిన పెద్ద తలకాయలు జైలుకు పోయే పరిస్థితి ఉందని చెప్పారు. ఆ కేసు సీరియస్‌ కేసు అనీ, ఎవరి అనుమతితో చేశారనేది తేలాల్సి ఉందన్నారు. అనుమతి లేకుండా ఫోన్‌ ట్యాప్‌ చేయడం పెద్ద నేరమన్నారు. రాష్ట్రంలో 200 మంది బీఆర్‌ఎస్‌ నేతలు పార్టీని వదిలేశారే గానీ, 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదని అంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ఒకవైపు కూతురు జైల్లో ఉంది..కాళేశ్వరంలో ఇంకా ఏమవుతుం దో… రూ.40 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. సీఎం సహా మంత్రులందరం పనిలో ఉంటున్నాం … కేసీఆర్‌ తీరుగా ఫార్మ్‌ హౌస్‌లో ఉండటం లేదు. క్రమం తప్పకుండా రివ్యూలు చేస్తున్నాం… దీంతో కేసీఆర్‌లో చివరకు ఏమవుతుందనే భయం పట్టుకుందని తెలిపారు.