
– ఎమ్మెల్సీ తాతా మధు
నవతెలంగాణ – అశ్వారావుపేట
సౌమ్యుడు,స్నేహశీలి,అందరూ బాగుండాలని ఆకాంక్షించే ఎమ్మల్యే మెచ్చా నాగేశ్వరరావును కొద్ది నెలల్లో జరగబోతున్న ఎన్నికల్లో మళ్ళీ ఆశీర్వదించి గెలిపించాలని ఎమ్మెల్సీ తాతా మధు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి జరగాలంటే “మెచ్చా’ గెలుపు అవసరం అని స్పష్టం చేశారు.స్థానిక క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే మెచ్చా తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే మెచ్చా కు సీఎం కేసీఆర్ పూర్తి అండగా ఉన్నారని,ఈయన ఏ పని చెప్పినా ఆపొద్దని సీ.ఎస్ తో పాటు ఇతర ఉన్నతాధికారులందరికీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని వివరించారు.గతంలో ఏ ఎమ్మెల్యే చేయని అభివృద్ధి మెచ్బా తో సాధ్యమైందని,ఈ నాలుగున్నర ఏళ్ళ కాలంలో రూ.200 కోట్లకు పైగా అభివృద్ధికి నిధులు తీసుకొచ్చారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉన్నారని,తెలంగాణ స్వరాష్ట్రంలో అభివృద్ధి పరులుగు తీశాయని చెప్పారు. ఎమ్మెల్యే ‘మెచ్చ’ అంటే సీఎం కేసీఆర్ కు,బీఆర్ఎస్ పార్టీలో అత్యంత గౌరవం ఉందని, సీఎం కేసిఆర్ తిరిగి పార్టీ టిక్కెట్లను ఇవ్వటం ఆయన పనితీరుకు నిదర్శమని గుర్తు చేశారు.తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని,అందుకే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మెచ్చా ను తిరిగి గెలిపించాలని కోరుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి అభివృద్ధి, సంక్షేమంలో రోల్ మోడల్ గా మారిందని,ఇదంతా మన సీఎం కేసీఆర్ పాలనా దక్షతతో నే సాధ్యమైందని చెప్పాను. దశాబ్దాల కాలంగా ఆదివాసీ సమస్యలను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని, భూమిపై ఆదివాసీల ఆత్మ గౌరవాన్ని గౌరవించి 1.87 లక్షల మంది గిరిజనులకు లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చారని అన్నారు. పట్టాలు ఇవ్వటమే కాకుండా రైతు బంధు, రైతు భీమా తో పాటు సబ్సిడీ పరికరాలు అందిస్తున్నామని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో అప్పటి పాలకులు వ్యవసాయం అంటే దండుగ అని ఎద్దేవా చేశారని, తెలంగాణ స్వరాష్ట్రం లో సీఎం కేసీఆర్ వ్యవసాయం పండుగ అని రుజువు చేసి చూపించారని పేర్కోన్నారు. దేశానికే తెలంగాణ వ్యవసాయం ఆదర్శంగా సీఎం కేసీఆర్ నిలిపారని చెప్పారు. ఆంధ్ర పాలనలో ఎరువులు, విత్తనాలు,కరెంట్ కోసం రైతులు నానా అవస్థలు పడ్డారని, పోలీసులు రక్షణలో విత్తనాలు పంపిణీ ని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సమస్యలన్నింటికీ పరిష్కరించి, వ్యవసాయ పెట్టుబడి కోసం ఎకరాకు రూ. 10 వేలు ఆర్ధిక సాయం అందిస్తుందని సంతృప్తి వ్యక్తం చేశారు.వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఉద్ఘాటించారు. వైద్యం, విద్య, వ్యవసాయం పురోగతి సాధించటం లో సీఎం కేసీఆర్ ప్రత్యేక ముద్ర వేశారని, భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు లభించటం ప్రభుత్వ సమర్ధ పాలనకు అద్దం పడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అమితంగా ప్రేమించే వ్యక్తి సీఎం కేసీఆర్ ఒక్కరే అని, అన్ని రాజకీయ పార్టీలకు ఎటు గా తెలంగాణ రాష్ట్ర సాధన మాత్రమేనని ప్రేరణ కలిగించి ప్రత్యేక రాష్ట్రం సాధించిన మహానేత కేసీఆర్ నాయకత్వం, రాష్ట్రానికి శ్రీరామ రక్షగా నిలుస్తుందని స్పష్టం చేశారు. కేసీఆర్ ముందు చూపుతోనే తెలంగాణ రాష్ట్రం అమెరికాకు దీటుగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మోసగాళ్ళు వస్తారని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఒక్క అవకాశం అంటూ ఓటు అడిగే కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్ళ పాటు అధికారంలో ఉన్న మీరు అప్పుడు చేయలేని అభివృద్ధిని ఎప్పుడు మాత్రం ఎలా చేస్తారని నిలదీశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని. ఆయనకు ప్రత్యమ్నాయం అవసరం లేదని సూచించారు. దేశంలో జరిగిన కుట్రలు, అంచనాలు, అనర్ధాలు, అవినీతితో పాటు అసలు తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెస్ పార్టీయే కారణమని మండిపడ్డారు.ఒకప్పుడు ఉపాధి కోసం తెలంగాణ ప్రజలు వలస వెళ్ళే వారని, ఇప్పుడు ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణకు వస్తున్నారని, హైద్రాబాద్ లో ఒక ఎకరం భూమి రూ. 100 కోట్లు ఉందంటే అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతుందని, సమైక్య పాలనలో ఎకరం కేవలం రూ.25 వేలు ఉండేదని, ఇప్పుడు రూ. లక్షలకు చేరిందని, భూములు అయ్యే పరిస్థితులు కూడా తెలంగాణలో లేదని వివరించారు. అన్ని రంగాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ప్రగతి ఫలాలు అందిస్తుంటే ఇతర రాజకీయ పార్టీలు ఇంకెందుకని ప్రశ్నించారు. సమావేశంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిది యూఎస్ ప్రకాశరావు, నాయకులు సత్యవరపు సంపూర్ణ, మందపాటి రాజమోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.