ప్రతి ఒక్కరికీ సమయస్ఫూర్తి అవసరం

ప్రతి ఒక్కరికీ సమయస్ఫూర్తి అవసరంసమయస్ఫూర్తి అంటే అప్పటికప్పుడు తట్టిన ఆలోచనను మనకి అనుకూలంగా ఇతరులు ఆమోదించే విధంగా వాడడం. దీనికి తెలివితేటలతో పనిలేదు. ఆలోచనకు తట్టిన మాటల్ని ఎదుటివ్యక్తి మాటలకు ధీటుగా సమాదానం ఇవ్వగలిగిన చతురత వుంటేచాలు. సమయస్ఫూర్తి వుంటే ఎలాంటి ఒత్తిడీ వుండదు. మనసు గాయపడదు. ఒక్కోసారి సమయస్ఫూర్తితో జరిగే ప్రమాదం నుండి తనను తాను రక్షించుకోవడం జరుగుతుంది అంటారు మనోవైజ్ఞానికులు. సమయస్ఫూర్తిని ఆంగ్లంలో ప్రజెన్స్‌ ఆఫ్‌ మైండ్‌ అంటారు.
ఒక ఇంటర్వ్యూలో అభ్యర్థిని ఇంటర్వ్యూ చేసే ఆయన ”బాబూ నువ్వు ఎన్ని మెట్లెక్కి ఈ అంతస్తులోకి వచ్చావు” అని అడగగానే ఆలస్యం చేయకుండా ఆ కాండిడేట్‌ ”సార్‌, మీరెన్ని మెట్లెక్కి వచ్చారో నేనూ అన్నే మెట్లెక్కి వచ్చాను” అంటాడు తడుముకోకుండా. ఆ సమాధానం విన్న అధికారి అతని సమయస్ఫూర్తిని మెచ్చుకుండాడు.
స్వామి వివేకానంద యూనివర్సిటీలో ‘లా’ చదువుతుండగా ఒక తెల్ల ప్రొఫెసర్‌కి వివేకానందుడంటే అస్సలు నచ్చేది కాదు. ఒకరోజు డైనింగ్‌ రూంలో ప్రొఫెసర్‌ లంచ్‌ చేస్తుండగా వివేకానందుడు వచ్చి ఆ ప్రొఫెసర్‌ పక్కనే కూర్చొని తనే లంచ్‌ బాక్స్‌ ఓపెన్‌ చేస్తుండగా… ప్రొఫెసర్‌ ”పంది, పావురం పక్కపక్కన కూర్చొని భోజనం చెయ్యవని నువ్వు తెలుసుకోవాలి” అంటాడు. అది విన్న వివేకానందుడు ప్రొఫెసర్‌తో గొడవెందుకనుకుని ఎలాంటి ఆత్మన్యూనతా భావానికి లోనుకాకుండా (చమత్కారంగా) ”మీరు దిగులు పడకండి సార్‌… నేను ఎగిరిపోతా” అంటూ వేరే టేబుల్‌ దగ్గరికి వెళ్లిపోయాడు తన సమయస్ఫూర్తి సామర్థ్యంతో.
ఢిల్లీ బస్సులో జరిగిన ఘోరం లాంటిది తృటిలో తప్పిపోయింది ఒకమ్మాయి సమయస్ఫూర్తితో. ఒకమ్మాయి హైద్రాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తుంది. వర్క్‌ పూర్తయ్యేసరికి సాయంత్రం చాలా టైమయింది. ఇంటికి వెళ్లడం కోసం షేరింగ్‌ ఆటో ఎక్కింది. తను దిగే చోటు వరకు ఆటోలో ఒక్కతే మిగిలింది. ఆటోడ్రైవర్‌, అతని పక్కనే కూర్చున్న మరో వ్యక్తి ఆటోను మెయిన్‌ రోడ్‌ మీదనుండి కాకుండా సందుగొందుల గుండా తీసుకెళ్లడం గమనించి ఏదో ప్రమాదం తనకు జరగబోతోందని ఊహించి, ఆమె తన బుర్రకు పదునుపెట్టడం ప్రారంభించింది. ఆలస్యం చేయకుండా ఫోన్‌ తీసి తను కిడ్నాప్‌కు గురవుతున్నట్టు చెప్పబోతుండగా డ్రైవర్‌ పక్కన కూర్చున్న వ్యక్తి ప్రయాణికులు కూర్చునే సీటులోకి దూకి ఆమె ఫోన్‌ చేయకుండా రెండు చేతులు అదిమి పట్టుకోడానికి ప్రయత్నించాడు. ఆమె ఆలస్యం చేయకుండా తన బ్యాగునుండి పెప్పర్‌ స్ప్రే తీసి అతని ముఖంపై స్ప్రే చేసింది. అతను కోలుకునే లోపే ఆటోనుండి బయటకు దూకింది. బైక్‌ పై వస్తున్న ఓ యువకుడు ఆమెను గమనించి వెంటనే ఆసుపత్రికి చేర్చాడు. దీన్నంతా కెమెరాలు రికార్డ్‌ చేసిన ఆనవాళ్లను బట్టి ఆటో డ్రైవర్‌ను, అతని పక్కన కూర్చున్న వ్యక్తిని గుర్తించి కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.
ఆ అమ్మాయి సమయస్ఫూర్తిని పోలీస్‌ అధికారులు ఎంతగానో మెచ్చుకున్నారు. బైక్‌ వ్యక్తికి ధన్యవాదాలు చెప్పారు. సమయస్ఫూర్తిని తెలిపే ఎన్నో కథలు పంచతంత్రం కథల్లో తెలిపారు.
ప్రతి ఒక్కరూ సమయస్ఫూర్తి అలవర్చుకోవడానికి ఐదు విషయాలపై శ్రద్ధ చూపాలంటారు మనోవైజ్ఞానికులు.
1. ప్రస్తుతం జరుగుతున్న విషయంపై శ్రద్ధ చూపాలి : గతం గురించి ఆలోచిస్తూ ప్రస్తుతంపై శ్రద్ధ పెట్టకపోతే అనేక అనర్థాలు జరుగుతాయి. కాబట్టి ఎక్కడున్నా, మన కండ్లముందు ఏం జరుగుతుందనేది గమనిస్తుండాలి.
2. ఎదుటివారి మాటల్ని శ్రద్ధగా వినాలి: మన ఎదుటున్న వారి మాటల్ని గమనిస్తూ, వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనలో సమయస్ఫూర్తి ఏర్పడి వారు మనతో అన్న మాటలకు ధీటుగా సమాధానం ఇవ్వగలం. పరధ్యానం పనికిరాదని, ప్రస్తుతంలో వుండి ప్రయత్నించాలని తెలిసుండాలి. తెల్ల ప్రొఫెసర్‌ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్న వివేకానందుడు తగు సమాధానమివ్వడం మనం గమనించవచ్చు.
3. భావోద్వేగాలను నియంత్రించుకోవాలి : మనల్ని ఉద్దేశించి ఎవరేమనుకున్నా వెంటనే ఎమోషనల్‌ కాకూడదు. ఆ సమయంలో మనల్ని మనం సంభాళించుకోవాలి. అలా చేయలేని వారిలో సమయస్ఫూర్తి లోపించి ఆత్మన్యూనతాభావంలో కూరుకుపోవాల్సి వస్తుంది.
పరీక్ష జవాబు పత్రాలను తీసుకెళ్తున్న ఉపాధ్యాయుడ్ని చూసిన తుంటరి విద్యార్థి ”సార్‌, గాడిద బరువు మోస్తున్నారు” అంటూ ఎగతాళిగా మాట్లాడతాడు. ఆ మాటలు విన్న వెంటనే ఉపాధ్యాయుడు ”ఏం చేయనుబాబూ.. ఈ బరువు నలభై గాడిదలది” అన్న మాటలతో ఆ విద్యార్థి అవమానంతో తలదించుకుంటాడు. అందులో అతని జవాబు పత్రాలు కూడా వున్నాయి కాబట్టి.
4. మనసును ఎప్పుడూ అప్రమత్తంగా వుంచుకోవాలి : మన మైండ్‌ను ఎప్పుడూ అలర్ట్‌గా వుంచుకోవాలి. దాంతో స్పందన వేగంగా స్పందిస్తుంది. కొందరు విద్యార్థులు ఉపాధ్యాయుడు అడిగే ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక… సార్‌, మళ్లీ ప్రశ్నేమిటో చెప్పమనడం దీనికి చక్కటి ఉదాహరణ.
5. కఠిన పరిస్థితుల్లో కూడా కలవరం చెందకుండా జాగ్రత్తపడాలి : పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా వుండవు. మన ముందున్న కఠిన పరిస్థితులను చూసి గుండె చెదిరిపోకూడదు. దానివల్ల నిరాశ, నిస్పృహ చోటు చేసుకుంటాయి. మనం చేసే పనిలో ఆటంకం ఏర్పడుతుంది. మనసు శాంతంగా వుంచుకుని ఏదైనా సంతోషకరమైన సంఘటన గుర్తుచేసుకుంటే అప్పటికప్పుడు కలవరపాటు దూరమై ప్రస్తుత పరిస్థితిపై శ్రద్ధ కలుగుతుంది.
సివిల్స్‌ పరీక్షల్లో పాల్గొనే వారికి సమయస్ఫూర్తితో ఇచ్చే సమాధానాలే వారిని ఆ పరీక్షల్లో నెగ్గేట్టు చేస్తాయంటారు. ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులను కలవరపరిచే ప్రశ్నలు అడిగినప్పుడు సమయస్ఫూర్తితో ఇచ్చే సమాధానాలే వారిని విజేతలుగా నిలుపుతాయంటారు సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌లోని ట్రైనర్స్‌.
సమయస్ఫూర్తి వ్యక్తిత్వానికి నిగానింపు తెస్తుందనే మాట నూటికి నూరు శాతం సత్యం.
– పరికిపండ్ల సారంగపాణి,
9849630290, కౌన్సిలింగ్‌ సైకాలజిస్ట్‌,