ముదుగంటి క్రియేషన్స్ పై విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘జితేందర్ రెడ్డి’. రాకేష్ వర్రె లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమా 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కింది. రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. బుధవారం ఈ చిత్ర గ్లింప్స్ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి, ‘జితేందర్ రెడ్డి జీవితం ఒక చరిత్ర. ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్ చేసిన విరించి ఈ జితేందర్ రెడ్డి గురించి తెలుసుకుని, డైరెక్ట్ చేస్తానని ముందుకు రావడం చాలా ఆనందంగా అనిపిం చింది. అలాగే జితేందర్ రెడ్డిగా రాకేష్ పాత్రలో జీవించారు. ఈ సినిమా తర్వాత జితేందర్ రెడ్డిగా గుర్తింపు తెచ్చుకుంటారు అంత అద్భుతంగా నటించారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రతి ఒక్కరికి జితేందర్ రెడ్డి పాత్రతో పాటు ఆయన చేసిన సేవ గుర్తుండిపోతుంది. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళ చరిత్ర తెలుసుకోవడం ఎంత ముఖ్యమో జితేందర్ రెడ్డి గురించి కూడా తెలుసుకోవడం కూడా అలాంటిదే. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ‘క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మొదలై ‘మిర్చి, బాహుబలి’ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాను. ‘ఎవరికీ చెప్పొద్దు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి తన అన్న జితేందర్ రెడ్డి కథని ప్రజలకు చెప్పాలనుకునే తాపత్రయం నాకు బాగా నచ్చింది. జితేందర్‌రెడ్డి పాత్రను పోషించడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని హీరో రాకేష్ వర్రె చెప్పారు. దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ, ‘నేను గతంలో చేసిన రెండు సినిమాలు లవ్ స్టోరీస్, మంచి హ్యూమర్ ఉన్న సినిమాలు. శేఖర్ నాకు కాల్ చేసి ఒక కథ ఉంది, డైరెక్ట్ చేయాలి అని చెప్పారు. కథ వినడానికి వెళ్ళినప్పుడు ఒక బుక్ ఇచ్చి చదువుకోమన్నారు. అది చదివిన తర్వాత ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ నేనే డైరెక్ట్ చేయాలి అనుకున్నాను. ఒక మంచి కథతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాను’ అని తెలిపారు.