ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి

నవతెలంగాణ – భువనగిరి
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే కోరారు. భువనగిరి పట్టణంలోని బాహర్ పేట్ 83, 85, 93, 94, 96 పోలింగ్ కేంద్రాలలో, బీబీనగర్ లోని 139,140, 141 పోలింగ్ కేంద్రాలలో  ప్రత్యేక ఓటరు క్యాంపులను జిల్లా కలెక్టర్ కె జండేగే పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో ఈరోజు, రేపు ఆదివారం అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని, ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బూత్ లెవెల్ అధికారులు అందుబాటులో ఉంటారని, అర్హులైన, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, తమ ఓటు నమోదు చేసుకోవాలని, ఓటు నమోదుకు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అధికారులు ఆబ్సెంట్, మరణించిన ఓటర్లను, ఫామ్ 8 మార్పులకు సంబంధించి నిబంధన ప్రకారం పరిశీలించి తొలగించాలని తెలిపారు. కొత్త ఓటర్ల నమోదుకు అవగాహన కల్పించాలని, 18 సంవత్సరాల యువ ఓటర్లను క్షేత్రస్థాయిలో గుర్తించాలని సూచించారు. జనవరి 25 వ తేదీ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా క్షేత్రస్థాయిలో ఓటరు నమోదుకు ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమాలలో తహసిల్దార్లు అంజిరెడ్డి,  శ్రీధర్, బూత్ లెవల్ అధికారులు ఉన్నారు.