– 18 సంవత్సరాలు నిండి డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి
– ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్
నవతెలంగాణ – సిరిసిల్ల
ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ కలిగి ఉండాలని 18 సంవత్సరాలు నిండి డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్ అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్ మేళ ఏర్పాటు చేసి రుద్రంగి ,వీర్నపల్లి మండల పోలీస్ స్టేషన్ల పరిధిలోని యువతి యువకులకు అవగాహన కల్పించి,వారి నుండి దరఖాస్తులు స్వీకరించి, డ్రైవింగ్ లైసెన్సు కి సంబంధించిన ఆన్లైన్ పరీక్ష పై అవగాహన కల్పించి, పరీక్షలో ఆర్హత సాధించిన 72 మందికి ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో లర్నింగ్ లైసెన్స్ అందించి వారికి డ్రైవింగ్ టెస్ట్ పెట్టి అర్హత సాధించిన వారికి సిరిసిల్ల పట్ట పోలీస్ స్టేషన్ లో జిల్లా కలెక్టర్,జిల్లా ఎస్పీ,రవాణా శాఖ అధికారులతో కలసి శనివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లైసెన్స్ లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా పోలీస్ శాఖ ఆద్వర్యంలో సామాజిక స్పృహతో మంచి కార్యక్రమానికి నాంది పలికారని, శాంతి భద్రతలతో పాటు అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతూ జిల్లా పోలీసులు విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు.జిల్లా పోలీస్ శాఖ గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో శాంతి భద్రతలను కాపాడుతునే విన్నూత కార్యక్రమాలతో ప్రజలకు చేరువ అవుతున్నారని,పోలీస్ స్టేషన్లలో ఓపెన్ హౌస్ వట్టి కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు.
డ్రైవింగ్ వచ్చి అర్హులైన వారందరూ కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని సూచించారు.ప్రమాదాలు జరిగిన సందర్భలలో మొదటగా అడిగేది లైసెన్స్ అని , ప్రమాదాలు జరిగిన సమయాల్లో లైసెన్స్ కలిగి ఉండటం వలన ప్రమాద భీమా లాంటివి వర్తిస్తాయన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ జా మాట్లాడుతూ.. జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ రోడ్డు ప్రమాదాలు నివారణ కొరకు తీసుకుంటున్న చర్యల పట్ల జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అభినందించారు.అంతే కాక లైసెన్స్ మేళ కార్యక్రమంలో భాగంగా ఐ డి టి ఆర్ సేవలను కూడా ఉపయోగించుకోవలని,డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న యువత స్వయం ఉపాధి వైపు వెళ్లాలని ప్రభుత్వ తోడ్పాటు కూడా అర్హులందరికీ ఉంటుందని పేర్కొన్నారు. ఎస్పీ అఖిల్ మహజన్ మాట్లాడుతూ.. జిల్లాలో వాహనాల తనిఖీ సమయాల్లో అధిక సంఖ్యలో వాహనదారులు లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారని గుర్తించామని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం నేరమని, జిల్లాలో లైసెన్స్ తీసుకోవడానికి చాలా మంది వాహనదారులు పడుతున్న ఇబ్బందులు, అవగాహన లేమి అంశాలను పరిగణనలోకి తీసుకొని పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్ణిత రుసుముతో దశల వారిగా లైసెన్స్ మేళ నిర్వహించి లైసెన్స్ లు అందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, డీటీఓ లక్ష్మణ్ ,సి.ఐ లు ,ఎస్.ఐ లు,సిబ్బంది పాల్గొన్నారు.