– నిబంధనలు పాటించకపోవడంతో ప్రమాదాలు : హైదరాబాద్ సీపీ కె.శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ చరిత్రాత్మక నగరం.. నాలుగువందల ఏండ్ల చరిత్ర ఉన్న మహానగరంలో లక్షలాది వాహనాలు రోడ్లపైకి వస్తుంటాయి.. ట్రాఫిక్ నియంత్రణలో ఉండాలంటే వాహనదారులందరూ సహకరించాలి.. అప్పుడే అది సాధ్యమవుతుందని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతామాసోత్సవాల్లో భాగంగా మంగళవారం హైదరాబాద్ గుడిమల్కాపుర్‌లోని కింగ్ ప్యాలెస్‌లో ఆటో డ్రైవర్లు, వాకర్స్‌కు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు జె.సిద్ధు(డీజే టిల్లు), నగర సీపీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అందరికీ ఎమర్జెన్సీ ఉంటుందని, అందరూ తొందరగా వెళ్లాలనుకుంటే వీలు కాదని, ముందుగా బయల్దేరిన వారే గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకుంటారని తెలిపారు. చాలామంది అడ్డదిడ్డంగా వాహనాలు నడిపిస్తున్నారని, అందులో అధిక సంఖ్యలో యువత ఉంటోందన్నారు. ప్రమాదాలు జరిగిన సమయంలో అమాయకులు ప్రాణం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే ట్రాఫిక్ నిబంధనలపై పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ కంట్రోల్ చెయ్యాల్సిన బాధ్యత సిటీ పోలీసులపై ఉందని, దానికి మీ వంతు సహాయ సహకారాలుంటేనే సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాహనాలు నడిపితేనే ట్రాఫిక్ కంట్రోల్‌లో ఉంటుందన్నారు.
అదనపు సీపీ (ట్రాఫిక్) విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. నో పార్కింగ్, రోడ్డుపై వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల అధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. రహదారి భద్రతా నియమాలు పాటించని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ రోజు నేను జీవించి ఉన్నానంటే ఆ హెల్మెటే కారణం: డీజే టిల్లూ
ఈ రోజు తాను జీవించి ఉన్నానంటే ఆ హెల్మెటే కారణమని సీనీ నటుడు సిద్ధూ (డీజే టిల్లూ) తెలిపారు. ”నేను ఇంజినీరింగ్ చదువుకునే రోజుల్లో పరీక్ష రాసి కీసరగుట్ట నుంచి ఈసీఐఎల్‌కు బైక్‌పై వస్తున్నాం.. నాతోపాటు మా కాలేజీ వాళ్లూ వస్తున్నారు. అయితే వెనుక నుంచి స్పీడ్‌గా వచ్చి నా బైక్‌ను ఓవర్‌టేక్ చేసే సమయంలో మా రెండు వాహనాల హ్యాండిల్స్ తగలడంతో మేము పడిపోయాం.
ఆ సమయంలో నా హెల్మెట్ కొంచెం విరిగిపోయింది, కానీ అదే నన్ను కాపాడింది. కొంచెం పగిలిన ఆ హెల్మెట్‌ను చూస్తే భయం వేసింది. ఆ హెల్మెటే నా తలలా ఊహించుకున్నాను. మరోసారి రాజమండ్రి నుంచి ముగ్గురం కలిసి 120స్పీడ్‌లో కారులో వస్తుండగా ఎదురుగా బైక్ రావడంతో దాన్ని తప్పించబోయి బ్రేక్ కొట్టడంతో కారు బోల్తాకొట్టింది. కానీ మేము సీటు బెల్టు పెట్టుకోవడంతో చిన్న గీత పడకుండా బయటపడ్డాం. ప్రభుత్వం ట్రాఫిక్ రూల్స్ పెట్టేది మన కోసమే.. మన సేఫ్టీతోపాటు అవతలి వారి రక్షణ కూడా అని గుర్తుంచుకోవాలి’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర ట్రాఫిక్-1 డీసీపీ ఎల్.సుబ్బారాయుడు, ట్రాఫిక్-2 డీసీపీ ఎన్.అశోక్‌కుమార్, సికింద్రాబాద్‌లోని రోటరీక్లబ్ గవర్నర్ డాక్టర్ బి.శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.