ఆత్మరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి: ఏఎస్పి శేషాద్రిని రెడ్డి

Everyone should learn martial arts for self-defense: ASP Seshadrini Reddyనవతెలంగాణ – వేములవాడ
అమ్మాయిలు ఆత్మరక్షణ కొరకు ఇతరుల ఎవరి మీద ఆధారపడవద్దని, నేటి సమాజంలో ఆత్మరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని  వేములవాడ సబ్ డివిజన్ అసిస్టెంట్ ఎస్పీ(ఏ.ఎస్పీ) శేషాద్రిని రెడ్డి సూచించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో మహిళల రక్షణ కొరకు నిర్వహిస్తున్న జ్వాల-2 కార్యక్రమంలో భాగంగా గురువారం వేములవాడ పట్టణంలోని కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయం(కే.జీ.బి.వి)లో  విద్యార్థినిలకు స్వీయ రక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి హాజరై విద్యార్థులనుద్దేశించి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరైనా సరే శారీరకంగా బాగుంటేనే మానసికంగా, మేధోపరంగా బిబాగుంటారని తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరూ శారీరకంగా బాగుండేలా రన్నింగ్, వ్యాయమం, కరాటే, మార్షల్ ఆర్ట్స్ వంటి  వాటిపై దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా అమ్మాయిలు ఎవరిని వారే రక్షించుకునేలా తయారవ్వాలని, ఆపద వేళల్లో ఎవరి మీద ఆధారపడకుండా కరాటే, మార్షల్ ఆర్ట్స్ వాటిపై పట్టు సాధించి అవతలి వ్యక్తులను అడ్డుకునేలా సిద్ధమవ్వాలని అన్నారు. అట్లాగే కెజిబివి విద్యార్థినిలకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రతి అత్యవసర సమయాల్లో  వేములవాడ పోలీస్ మీ వెంట ఉంటారని భరోసా కల్పించారు. కార్యక్రమంలో భాగంగా  ముందుగా కరాటే మాస్టర్ మన్నన్ ఆధ్వర్యంలో విద్యార్థినిలు ప్రదర్శించిన కరాటే, మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు అతిధులను ఆకట్టుకున్నాయి. తదనంతరం  ఇటీవల మంచిర్యాల జిల్లాలో  జరిగిన జాతీయ కరాటే పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి, టీమ్ విభాగంలో మొదటి బహుమతి పొందిన కెజిబివి విద్యార్థినిలను ఏఎస్పీ  ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ వీరప్రసాద్ మాస్టర్ మన్నన్, విద్యార్థులు, ఉపాధ్యాయులు తో పాటు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.