నవతెలంగాణ – కమ్మర్ పల్లి
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాయ గౌడ్ పిలుపు నిచ్చారు. సోమవారం మండల ప్రత్యేక అధికారి హోదాలో పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన ర్యాలీ, గ్రామసభలో పాల్గొని మాట్లాడారు.పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమం సోమవారం నుంచి ఐదు రోజులపాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా పల్లెల్లో శుభ్రతతో పాటు చెట్లను సంరక్షించడం, మొక్కలు నాటడం వాటి కార్యక్రమాలతో పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.అంతకుముందు ఎంపీడీవో రాజ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, మండల అధికారులు కలిసి భారీ సంఖ్యలో హాజరైన మహిళల ర్యాలీని ప్రారంభించారు. గ్రామ పంచాయతీ ఆవరణ నుంచి మార్కెట్ విధి గుండా జాతీయ రహదారి పై జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు ర్యాలీ కొనసాగింది.అనంతరం పాఠశాల ఆవరణలో స్వచ్ఛధనం పచ్చదనంపై ప్రతిజ్ఞ చేశారు. పాఠశాల ఆవరణలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాయ గౌడ్, అధికారులు కలిసి శ్రమదానం చేసి, మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఐకెపి ఎపిఎం కుంట గంగాధర్, ఏపీవో విద్యానంద్, పంచాయతీ కార్యదర్శి శాంతి కుమార్, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.