నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
అన్ని అర్హతలు ఉండి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. శనివారం స్థానిక సుందరయ్య భవన్, భువనగిరిలో సీపీఐ(ఎం) భువనగిరి మండల కార్యదర్శివర్గ సమావేశం మండల కార్యదర్శి వర్గసభ్యులు ఏదూనూరి మల్లేశం అధ్యక్షతన జరుగగా ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల నుంచి బిఆర్ఎస్ పాలనలో అనేక సార్లు పేదలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు పెట్టి అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం పట్టకుండ, ప్రజలను ఇబ్బంది పెట్టిన బిఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీకి అధికారమిస్తే గెలిచే వరకు అనేక సంక్షేమ పథకాలు ప్రకటించిన ఈ ప్రభుత్వం సంవత్సరం గడుస్తున్నా ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. అమలు చేయడంలో గత ప్రభుత్వ విధానాలే అమలు చేస్తుందని విమర్శించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తానన్న ఈ ప్రభుత్వం ఒక్కొక్క గ్రామంలో 100 నుండి 200 మంది దాకా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు పెట్టుకుంటే కేవలం 20 నుండి 50 మందికి మాత్రమే రేషన్ కార్డులు సాంక్షన్ అయినట్టు చెప్తున్నారని అన్నారు. మరి మిగతా వారి పరిస్థితి ఏమి కావాలని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వము అర్హత కలిగి దరఖాస్తు చేసుకొన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని రేషన్ కార్డులు అందరికీ ఇచ్చేవరకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని నర్సింహ హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, పార్టీ మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యులు కొండ అశోక్, అన్నంపట్ల కృష్ణ, కొండమడుగు నాగమణి లు పాల్గొన్నారు.