– ఆయనో బహుముఖ ప్రజ్ఞాశాలి : ఎంఏకే దత్తు సంస్మరణ సభలో బీవీరాఘవులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అందరి బాధ తన బాధగా భావించి చివరికంటూ ఉపాధ్యాయ, ప్రజాతంత్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారనీ, ఆయనొక బహుముఖ ప్రజ్ఞాశాలి అని సీపీఐ(ఎం) పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీరాఘవులు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీఎస్‌యుటీఎఫ్ ఆధ్వర్యంలో ఆ సంఘం అధ్యక్షులు కె జంగయ్య అధ్యక్షతన ఎంఎకే దత్తు సంస్మరణ సభ నిర్వహించారు. సభలో రాఘవులు మాట్లాడుతూ తన బాధలను అందరికీ పంచాలనుకోలేదనీ, అందరి బాధల్లో తాను పాలుపంచుకున్నారని గుర్తు చేశారు. అదో ఉదాత్తమైన లక్షణమన్నారు. మరణం అనివార్యమైనప్పటికీ..బతికిన కాలంలో దత్తు అసమానతలు లేని సమాజం కోసం పనిచేశారని గుర్తు చేశారు. ఆయన ఆదర్శ ఉపాధ్యాయుడనీ, అంకిత భావం కలిగిన నాయకుడని కొనియాడారు. ఆయన మరణం ఉపాధ్యాయ ఉద్యమానికేగాక అభ్యుదయ, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని చెప్పారు. తన దేహాన్ని వైద్య కళాశాలకు అప్పగించటం ద్వారా మరణించాక కూడా వైద్య విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారని తెలిపారు. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మాట్లాడుతూ అసమాన ప్రతిభాశాలి, అవిశ్రాంత ఉపాధ్యాయుడు దత్ అని కీర్తిస్తూ నివాళులర్పించారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ ఒక మంచి సహచరుడిని కోల్పోయాననీ, ఆయనతో మాట్లాడటమే ఒక విజ్ఞానం అని గుర్తుచేశారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ మాట్లాడుతూ విద్యార్థి దశనుండి నేటివరకు దత్‌తో తనకు గల అనుబంధాన్ని వివరించారు. లౌకిక, ప్రజాస్వామిక విలువలకు తుదివరకు కట్టుబడి పనిచేశారని తెలిపారు. అలాంటి వ్యక్తుల అవసరం ఇప్పుడు చాలా ఉందన్నారు. యుటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ రాష్ట్ర నాయకుడి నుంచి సాధారణ కార్యకర్తల వరకు ఏ స్థాయిలో తన అవసరం ఉంటే ఆ స్థాయికి దిగి పనిచేయగలిగిన సమర్దుడు ఎంఏకె దత్ అని గుర్తు చేశారు. జీవితం చివరి శ్వాస వరకు ఉద్యమంలో మమేకమయ్యారని నివాళులర్పించారు. తొలుత దత్ చిత్రపటానికి రాఘవులు, నర్సిరెడ్డి, దత్ భార్య లలిత తదితరులు పూల మాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. వివిధ ప్రజాసంఘాల నాయకులు ఎస్ పుణ్యవతి, పాలడుగు భాస్కర్, ఎం సంయుక్త, టి జ్యోతి, పి కృష్ణమూర్తి, ఎన్ వేణుగోపాల్, వి నాగేశ్వరరావు, జి నాగేశ్వరరావు, పి మాణిక్ రెడ్డి, కె పార్థసారధి, బి రవికుమార్, స్కైలాబ్ బాబు, పద్మశ్రీ, రాధేశ్యామ్, ప్రమోద్, మస్తాన్ రావు, జి బుచ్చిరెడ్డి, సత్యానంద్, గాలయ్య, జ్ఞానమంజరి, కె రవికుమార్, సింహాచలం తదితరులు పాల్గొని నివాళులర్పించారు.