అంతా అనుకున్నట్లే

అబద్దం అమీబాలాగా రూపాలు మార్చుకుంటూ
ఇంటింటిని చుట్టేస్తున్నది.
జనాన్ని నజరబంద్‌ చేసి
వందేమాతరం రైలు వేగంతో దూసుకెళ్తున్నది
ఉడుకు నెత్తురు ఉక్కునరాలకు
విద్వేషపు సెలైన్లు ఎక్కిస్తున్నది
చిటికెన వేళ్ళ బంధంతో బాల్యాన్ని దాటిన
అన్నదమ్ముల మధ్య
ఇపుడు విద్వేషపు గోడలు నాటుతున్నది
ఒకే కంచంలో ఆకలి మంటలార్పుకున్న ఆత్మీయులు
ఒకే చెప్పుల జతతో కష్టాన్ని పంచుకున్న దోస్తానాలు
ఒక్కొక్క రంగుల గుడారంలో
కత్తులు నూరుకుంటున్నయి.
ఏ ఇంట్లో చూసినా ముఖాలన్ని
పరశురాముని గండ్రగొడ్డండ్లయి భయపెడుతున్నయి
దారుల నిండా నిజాన్ని ఇజాల పెట్టెలో కుక్కి
బరితెగించి బరిసెల చేతులతో దాడికి దిగుతున్నది.
పాత సామాను దుకాణాలను
బుల్డోజర్లు నమిలేస్తున్నయి
ఇంకా ఇలాగే నోర్లు తెరవకుంటే
మాటలు నిషేధపు గోదాములో
భావాలు నియంత్రణా కొలిమిలో కాలి కమురెక్కవచ్చు
మనిషే బానిస రోబోయై తెంచుకోవడానికి
తలను అప్పగించే కాలం రావచ్చు
కాలు కదిపినా అడుగులేసినా చూపులు స్వేచ్చాతీగలై
జనంలో అల్లుకోవాలన్నా వాడి హుకుం సైగచేయాలి.
కట్టే బట్ట, తినే తిండి, నిల్చున్న నీడ
అన్నీ వాడి బూజుపట్టిన మెనో ప్రకారమే
ఇపుడు నటనలు లేవు కపట చేష్టలులేవు
ఎక్కడ చూసినా నీతి, ధర్మం, న్యాయం
బట్టలిడిసి తిరుగుతున్నయి లోకం కాండ్రించి ఉమ్మేసినా
ఉన్మాదపు మత్తులో ఊగిపోతున్నది
అవకాశాలు ఒయాసిస్సులు మాత్రమే
ఒంటినిండా అన్నీ సర్దుకొని
ఒక్కసారి రాజ్యాంగాన్ని స్మరించుకొని
నిశబ్ద యుద్ధంకై సిద్ధమవ్వాలి
కులాలు మతాల నిషాలలో సోయితప్పిన మెదళ్ళకు
కొత్త నరాలు పేనాలి లౌకికత్వం మహావృక్షంపై
అందరం ఆనందంతో కేరింతలు కొట్టాలి.
– డా|| ఉదారి నారాయణ, 9441413666